Planning For Retirement :నేటి యువత ఉద్యోగంలో చేరినప్పుడే పదవీ విరమణ ప్రణాళికను రూపొందించుకోవడం చాలా అవసరం. కానీ చాలా మంది ఈ జీవితకాల లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. పైగా కొన్ని పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు. విశ్రాంత జీవితంలో సంతోషంగా గడపాలంటే.. కచ్చితంగా ముందు నుంచే ఎలాంటి పొరపాట్లు లేకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే పదవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరంగా ఉండగలుగుతారు.
భరోసా ఇస్తుంది!
Retirement Plan Benefits :భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆర్థిక ప్రణాళిక తోడ్పడుతుంది. ఇప్పుడున్న ధరలు, ఖర్చులు మరో 30 ఏళ్ల తర్వాత బాగా పెరిగే అవకాశం ఉంది. కాలక్రమంలో ద్రవ్యోల్బణం మన డబ్బు విలువను బాగా తగ్గిస్తుంది. కనుక, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా, సాధ్యమైనంత జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఈ క్రమంలో చాలా మంది చేసే కొన్ని పొరపాట్లు ఏమిటి? వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్య నిధి ఉపసంహరణ
Provident Fund Withdrawal : ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పదవీ విరమణ చేసేంత వరకూ ఇది ఒక నమ్మకమైన పొదుపు పథకం. విశ్రాంత జీవితంలో మీకు భరోసానిచ్చే ఒక సంపద ప్రావిడెంట్ ఫండ్. చాలామంది చిన్న చిన్న అవసరాల కోసం ఇందులో నుంచి డబ్బును ఉపసంహరించుకుంటారు. దీనివల్ల మీ భవిష్యత్‌కు అవసరమైన నిధిని కూడబెట్టే అవకాశం లేకుండాపోతుంది. ఇల్లు కొనడం, పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం సాధ్యమైనంత వరకు పీఎఫ్ నుంచి డబ్బు తీయకూడదు. గృహరుణాలు, విద్యారుణాలు లాంటి మార్గాలను ఎంచుకోవడం మంచిది. అలాగే అవసరం ఏదైనా సరే.. దానికి పీఎఫ్ నుంచి డబ్బులు తీయడం కాకుండా, వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడం మంచిది.
పీపీఎఫ్ మర్చిపోవడం
PPF Installments : ప్రజా భవిష్య నిధిలో రూ.500 నుంచి జమ చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల చొప్పున 15 ఏళ్లపాటు మదుపు చేస్తే.. ఇప్పుడున్న 7.1 శాతం వడ్డీ రేటు చొప్పున లెక్కవేసినా... గడువు తీరే సరికి మీ దగ్గర రూ.40.68 లక్షలు జమ అవుతాయి. 15 ఏళ్ల తర్వాత కూడా నిబంధనల మేరకు పెట్టుబడిని కొనసాగించే వీలుంది. ఫలితంగా మీ భవిష్యత్ భద్రంగా ఉంటుంది. పీపీఎఫ్‌లో పొదుపు ప్రారంభించకపోతే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నట్లే లెక్క.
ఆరోగ్య బీమా లేకపోవడం
Health Insurance Benefits : వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే కచ్చితంగా ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా తప్పనిసరి. పదవీ విరమణ తర్వాత వైద్య ఖర్చులు అధికం కావచ్చు. యాజమాన్యం అందించే బృంద పాలసీ అన్ని సందర్భాల్లోనూ మీకు అండగా ఉండకపోవచ్చు. కొన్ని సంస్థలు లేదా కంపెనీలు పదవీ విరమణ, రాజీనామా సందర్భాల్లో దాన్ని వ్యక్తిగత పాలసీగా మార్చుకునే సౌలభ్యాన్ని ఇస్తాయి. కొన్ని సంస్థలు ఇలాంటి వెసులుబాటును అసలు కల్పించకపోవచ్చు. అందుకే మీ అవసరాలకు అనుగుణంగా మంచి ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్య బీమా తీసుకునే విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. వాయిదాలు వేయకూడదు. ఎందుకంటే.. ఒక సారి అనారోగ్యం వచ్చాక మీరు అప్పటి వరకు కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది.
అత్యవసర నిధి
Emergency Fund Benefits : మన జీవితం చాలా అనూహ్యమైనది. ఆర్థిక అత్యవసర పరిస్థితులు ఎప్పుడైనా తలెత్తవచ్చు. అందుకే కనీసం 6-12 నెలలకు సరిపోయేలా అత్యవసర నిధి మన దగ్గర ఎల్లప్పుడూ అండేలా చూసుకోవాలి. అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు, మీ దీర్ఘకాలిక పొదుపు పథకాల నుంచి డబ్బును వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేకుండా, ఇది కాపాడుతుంది.
బీమా తీసుకోకుండా ఉండడం:
Life Insurance Importance : కుటుంబ పెద్దగా మనం మన బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుంది. ఒక వేళ పొరపాటున మనకి ఏమైనా జరిగితే.. మన కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. అందుకే అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా.. ఆపద కాలంలో ఆదుకునే జీవిత బీమా పాలసీని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి మన వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు వరకూ జీవిత బీమా తీసుకోవాలి. చిన్న వయసులోనే పాలసీ తీసుకుంటే.. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ లభిస్తుంది. మీకు కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది.