ఒక లక్ష్యం నిర్ణయించుకొని, దానికి అనుగుణంగా పెట్టుబడులు ప్రారంభించడమే ఆర్థిక స్థిరత్వ సాధనలో తొలి అడుగు. మీరు అనుకుంటున్న లక్ష్యాన్ని, అందుకు అయ్యే మొత్తం, వ్యవధిని ముందు గుర్తించండి. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాల జాబితాను తయారు చేయండి. అనుకోవడం తేలికే. కానీ, దాన్ని సాధించేందుకు ఎంతో క్రమశిక్షణ అవసరం. స్వల్పకాలిక అవసరాలు ఉన్నవారు.. పెట్టుబడి మొత్తాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వెసులుబాటు ఉండాలి. ఇలాంటి వారు మదుపు చేసేందుకు డెట్ ఫండ్లను పరిశీలించాలి. మార్కెట్ ఇచ్చే అవకాశాలను అందుకుంటాం.. కాస్త నష్టభయం ఉన్నా ఇబ్బంది లేదు అనుకుంటే.. హైబ్రీడ్ ఫండ్లు లేదా పాసివ్ ఫండ్లలో మదుపు చేయొచ్చు. దీర్ఘకాలిక లక్ష్యాలుండి, కాస్త నష్టం వచ్చినా భరించే శక్తి ఉన్నవారు ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవాలి. వివిధ ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడుల ప్రణాళిక వ్యూహాత్మకంగా ఉండాలి. లేకపోతే అనుకున్న లక్ష్యం చేరేందుకు ఆలస్యం అవుతుంది.
కష్టంలో ఆదుకునేలా..
పెట్టుబడులను ఎప్పుడూ మధ్యలోనే వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయొద్దు. అవసరం వచ్చినప్పుడల్లా.. భవిష్యత్ లక్ష్యాల కోసం దాచుకున్న మొత్తాన్ని తీస్తుంటే.. ఎప్పటికీ ఆర్థిక స్థిరత్వం సాధించలేం. కాబట్టి, ప్రతి కుటుంబానికీ కొంత అత్యవసర నిధి అందుబాటులో ఉండాలి. కుటుంబం ఖర్చులు, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఈ నిధిని ఏర్పాటు చేసుకోవాలి. పొదుపు మొత్తాన్ని ముట్టుకోకుండా మన అవసరాలు తీరేందుకు ఇది ఉపయోగపడుతుంది. కనీసం 3-6 నెలలకు సరిపోయే మొత్తం లిక్విడ్ ఫండ్లలో మదుపు చేయొచ్చు. సులువుగా డబ్బును వెనక్కి తీసుకునేలా ఉండటమే ఇక్కడ ప్రధానం.
వైవిధ్యంగా..
మార్కెట్ పనితీరు ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. పెట్టుబడి పెట్టేవారు ఈ విషయాన్ని గమనించాలి. మార్కెట్ గమనం ఎలా ఉన్నా పెట్టుబడులు సాధ్యమైనంత వరకూ లాభాలను పంచేలా ఉండాలి. అందుకు అనుగుణంగా పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఈక్విటీ, డెట్, బంగారం, స్థిరాస్తులు, డిపాజిట్లు ఇలా మదుపరులు వివిధ పథకాలను ఎంచుకోవాలి. ఒక పథకం పనితీరు బాగాలేకపోయినా మిగతావి పోర్ట్‌ఫోలియోలో నష్టాన్ని పరిమితం చేస్తాయి.