అనారోగ్యం బారిన పడితే.. ఆరోగ్య బీమా ఆసుపత్రి ఖర్చులను చెల్లిస్తుంది. కానీ, ప్రమాదం జరిగినప్పుడు ఆర్జన శక్తిపై తాత్కాలికంగా ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు పాక్షిక లేదా శాశ్వత వైకల్యం ఏర్పడవచ్చు. దీనివల్ల దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు వ్యక్తిగత ప్రమాద బీమా (పీఏసీ) అండగా ఉంటుంది. ఈ ప్రమాద బీమా పాలసీకి పలు అనుబంధాలను జోడించుకునే వీలూ ఉంటుంది. ప్రమాదవశాత్తూ మరణం, తాత్కాలిక/శాశ్వత వైకల్యం, పాక్షిక శాశ్వత వైకల్యం లాంటివి ఇందులో ప్రధానంగా ఉంటాయి. ఈ అనుబంధ పాలసీల కోసం కొంచెం అదనంగా ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది.
ఎవరికి ఇస్తారంటే..
వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని అయిదేళ్ల వారి నుంచి 70 ఏళ్ల వరకు ఉన్న వారికి ఇస్తారు. జీవిత, ఆరోగ్య బీమా పాలసీల తరహాలో వయసును బట్టి, ప్రీమియం మారదు. అన్ని వయసుల వారికీ ఒకే ప్రీమియం ఉంటుంది. అయితే, వ్యక్తుల ఆదాయం, వారికి ఎదురయ్యే ప్రమాదాల జాబితాను బట్టి, పాలసీ విలువ, ప్రీమియాన్ని నిర్ణయిస్తారు.
రెండు మార్గాల్లో...
వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలు రెండు రకాలుగా తీసుకునే అవకాశం ఉంది. సాధారణ బీమా సంస్థలు ఈ పాలసీని ప్రత్యేకంగా స్టాండలోన్ పాలసీగా అందిస్తున్నాయి. జీవిత బీమా సంస్థలు అనుబంధ పాలసీగానూ దీన్ని ఇస్తున్నాయి. సాధారణ బీమా సంస్థలు అందించే పాలసీని ఏటా పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. జీవిత బీమా పాలసీతోపాటు తీసుకున్నప్పుడు దీర్ఘకాలిక ఒప్పందంగా ఉంటుంది.
నష్టమేదైనా..
పూర్తిస్థాయి వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని ఎంచుకునేందుకే ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రమాదవశాత్తూ మరణం, శాశ్వత పూర్తి వైకల్యం, శాశ్వత పాక్షిక వైకల్యం, తాత్కాలిక వైకల్యం తదితర సందర్భాల్లో పరిహారం ఇచ్చేలా పాలసీని ఎంచుకోవాలి. ప్రమాదం జరిగి, ఉద్యోగానికి వెళ్లలేని పరిస్థితుల్లో వారానికి కొంత మొత్తం చెల్లించే ఏర్పాటు ఉంటుంది. ఇది పాలసీ విలువ ఆధారంగా నిర్ణయిస్తారు. కాబట్టి, పాలసీ ఎంచుకునేటప్పుడు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇది ఎంతో భరోసా కల్పిస్తోంది.