కరోనా అనంతరం చాలా మంది సొంత వాహనాల్లో ప్రయాణం చేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రోడ్లపై వాహనాల సంఖ్య సైతం పెరుగుతోంది. దీంతో రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. ఈ అనుకోని దుర్ఘటనల నుంచి మనల్ని మనం ఆర్థికంగా రక్షించుకోవాలి. అదే విధంగా కుటుంబానికి కూడా భరోసా కల్పించాలి. ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడేదే వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ. ఏదైనా అనుకోని ఆపద వచ్చినప్పుడు ఇది ఆర్థికంగా మనకు రక్షణనిస్తుంది.
వాహనాల్లో ప్రయాణించేటప్పుడు అనుకోని ప్రమాదం ఎదురవ్వవచ్చు. వాహనంలో ఉన్న ప్రయాణికులు చనిపోవచ్చు. పూర్తిగా వైకల్యానికి గురి కావచ్చు. పాక్షిక వైకల్యం కలగవచ్చు. ఇలాంటి ఆపద సమయాల్లో వ్యక్తిగత ప్రమాద బీమా.. సంభవించిన నష్టంలో ఆర్థిక అంశాలను చూసుకుంటుంది. ప్రధానంగా ప్రమాదం వల్ల పాలసీదారుడికి ఏదైనా జరిగితే.. కుటుంబానికి ఆర్థిక చిక్కులు ఎదురవ్వకుండా భరోసా కల్పిస్తుంది. ఈ వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని కొనుగోలు చేసేందుకు 18-65 సంవత్సరాల వారు అర్హులు.
ప్రమాదం జరిగిన అనంతరం వ్యక్తికి కొన్నాళ్లపాటు ఆదాయం ఆగిపోవచ్చు. చికిత్స ఖర్చు, ఈఎంఐలు, రుణాలు ఇతర అవసరాలు తీరేలా వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ నుంచి ఏక మొత్తంగా కొంత డబ్బు వస్తుంది. దాన్ని అవసరాలకు వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ మధ్య బీమా కంపెనీలు సాహస విహార యాత్రలను కూడా ఈ పాలసీల పరిధిలోకి తీసుకొచ్చాయి.