అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేవి జీవిత బీమా పాలసీలు. ఇందులోనూ తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణనందించేవి టర్మ్ పాలసీలు. ఇటీవలి కాలంలో బీమా సంస్థలు ఈ తరహా పాలసీలను అధికంగా తీసుకొస్తున్నాయి. అందులో మన అవసరానికి సరిపోయే పాలసీని ఎంచుకోవడం ఎంత అవసరమో.. సరైన బీమా సంస్థ నుంచి పాలసీని తీసుకోవడమూ అంతే ప్రధానం. పాలసీదారుడు దూరమైనప్పుడు పరిహారం విషయంలో ఇబ్బంది పెట్టే వాటికి దూరంగా ఉండటమే మేలు. బీమా సంస్థలను బట్టి టర్మ్ పాలసీల నిబంధనలు, వర్తించేవి, మినహాయింపులు వేర్వేరుగా ఉంటాయి. పాలసీ కొనుగోలు చేసేటప్పుడు ఇవన్నీ చూడటంతోపాటు.. కంపెనీ చెల్లింపుల చరిత్రనూ తప్పనిసరిగా చూడాలి.
నిర్ణీత వ్యవధిలో వచ్చిన క్లెయింలు, వాటిలో ఎన్ని పరిష్కరించారో తెలిపేదే పరిహారం పరిష్కార నిష్పత్తి (క్లెయిం సెటిల్‌మెంట్ రేషియో). పాలసీదారుడు మరణించిన సందర్భంలో నామినీ బీమా సంస్థను సంప్రదించి, పాలసీని క్లెయిం చేసుకుంటారు. బీమా సంస్థ నిబంధనల మేరకు ఆ క్లెయింను ఆమోదించడం లేదా తిరస్కరిస్తుంది. మంచి పరిష్కార నిష్పత్తి ఉన్న సంస్థ నుంచి పాలసీ తీసుకుంటే.. తిరస్కరణకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తక్కువ నిష్పత్తి ఉండే సంస్థ.. పరిహారం ఇవ్వడంలో ఇబ్బందులు పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు ఒక సంస్థకు ఏడాదిలో 100 క్లెయింలు వచ్చాయనుకుందాం. ఎలాంటి ఇబ్బందీ లేకుండా అందులో 90 పాలసీలకు పరిహారం ఇస్తే.. దాని చెల్లింపుల నిష్పత్తి 90శాతం ఉన్నట్లు లెక్క.
నీ బీమా సంస్థలు పాలసీదారులను ఆకర్షించే ప్రయత్నాల్లో ఆన్‌లైన్‌లో తక్కువ ప్రీమియానికే ఈ పాలసీలు అందుబాటులోకి తెస్తున్నాయి. కేవలం ప్రీమియం తక్కువగా ఉందని పాలసీలను తీసుకోవడం ఎప్పుడూ సరికాదు. జీవితంలో టర్మ్ పాలసీ అనేది ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం. కాబట్టి, పూర్తిగా పరిశోధన చేశాకే పాలసీని ఎంచుకోవాలి.