Payment For Unused Paid Leave For Employees : ఉద్యోగులకు త్వరలో మంచి రోజులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే, భారత పార్లమెంట్ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ త్వరలో అమలు అయ్యే అవకాశం ఉంది. ఇవే కనుక అమలు అయితే ఉద్యోగులకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయి. అవి ఏమిటంటే..
- ఉద్యోగులు ఉపయోగించుకోని పెయిడ్ లీవ్స్‌కు.. కంపెనీలు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
- ఉద్యోగి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) కంట్రిబ్యూషన్ పెరుగుతుంది.
- వారంలో పని గంటలు కాస్త పెరుగుతాయి.
- చేతికి అందే జీతం (టేక్-హోమ్ పే) కాస్త తగ్గుతుంది.
ఉపయోగించుకోని సెలవులకు - పేమెంట్
సాధారణంగా ప్రతి ఉద్యోగికి కొన్ని పెయిడ్ లీవ్స్ ఉంటాయి. వాటిని కనుక అతను ఉపయోగించుకోకపోతే.. కంపెనీ యాజమాన్యం అందుకు తగిన మొత్తాన్ని సదరు ఉద్యోగికి చెల్లించాల్సి ఉంటుంది. ఇదే కనుక అమలులోకి వస్తే.. ప్రతి ఉద్యోగికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ (OSH) కోడ్ ప్రకారం, ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక ఉద్యోగి 30 రోజుల కంటే మించి.. వేతనంతో కూడిన సెలవులు పొందడానికి వీలులేదు. అందువల్ల ఉద్యోగి 30 రోజుల కంటే అధికంగా ఉన్న పెయిడ్ లీవ్స్‌ను కచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఒక వేళ సదరు పెయిడ్ లీవ్స్‌ను కనుక అతను ఉపయోగించుకోకపోతే.. కంపెనీ యాజమాన్యం అతనికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ లేబర్ కోడ్.. మేనేజర్, సూపర్వైజర్ లాంటి ఉన్నత స్థానాల్లో ఉన్న ఉద్యోగులకు వర్తించదు.
4 కార్మిక చట్టాలు
New Labour Code 2023 : భారత పార్లమెంట్ ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే.. 4 కొత్త లేబర్ కోడ్లను ఆమోదించింది. అవి :
- వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం & పని పరిస్థితుల కోడ్ (OSH Code)
- ఉద్యోగుల వేతనాలు కోడ్
- పారిశ్రామిక సంబంధాల కోడ్
- సామాజిక భద్రతా కోడ్
కేంద్ర ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లను అయితే ఆమోదించింది.. కానీ వీటిని ఇంకా అమలులోకి తేలేదు.
ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు?
ఆర్థిక నిపుణుల ప్రకారం,కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త లేబర్ కోడ్ల వల్ల ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా తాము ఉపయోగించుకోని సెలవులు లాప్స్ (నిరర్థకం) కాకుండా ఉంటాయి. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ - 2020 ప్రకారం, ఉద్యోగులు 30 కంటే ఎక్కువ ఉన్న పెయిడ్ లీవ్స్‌ను ఉపయోగించుకోకపోతే.. వాటికి తగిన పరిహారం పొందవచ్చు. అంటే అదనంగా మిగిలిపోయిన సెలవులను క్యాష్ చేసుకోవచ్చు. సాధారణంగా ప్రతి క్యాలెండర్ ఇయర్ చివరిలో సంస్థ లేదా కంపెనీ యాజమాన్యం.. తమ ఉద్యోగులకు ఈ నగదును చెల్లించాల్సి ఉంటుంది.
వాస్తవానికి ఈ లేబర్ కోడ్ ప్రకారం, ఒక ఉద్యోగి తన పెయిడ్ లీవ్స్‌ను పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. లేదా వాటిని నగదు రూపంలోకి మార్చుకోవచ్చు. లేదా క్యారీఫార్వార్డ్ చేసుకోవచ్చు. అంతే కాని ఉద్యోగికి ఉన్న సెలవుల బ్యాలెన్స్ అనేది ల్యాప్స్ కావడం అనేది జరగదు. ప్రస్తుతం అనేక సంస్థలు.. పరిమితికి మించి లీవ్ ఎన్క్యాష్మెంట్గానీ, లీవ్స్ క్యారీ ఫార్వర్డ్స్‌ను కానీ అనుమతించడం లేదు. అయితే కొత్త కార్మిక చట్టం కనుక అమలు అయితే, ఉద్యోగులకు ఇలాంటి సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది.
సరదాగా విహారం చేయండి.. ప్లీజ్!
కొత్త కార్మిక చట్టాలు కనుక అమలులోకి వస్తే.. సంస్థలు లేదా కంపెనీలు.. తమ ఉద్యోగులను వెకేషన్‌కు వెళ్లి రమ్మని కోరే అవకాశం ఉంటుంది. లేదంటే, ఉద్యోగులు ఉపయోగించుకోని సెలవులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల ఆయా సంస్థలు లేదా కంపెనీలపై ఆర్థిక భారం పడుతుంది. అలాగే వాటి క్యాష్ ఫ్లోపై కూడా ప్రభావం పడుతుంది.
ఉపయోగించని అదనపు సెలవులకు ఎంత పే చేస్తారు?
How Much Will Employees Be Paid For Unused Leaves :OSH ఓఎస్‌హెచ్ కోడ్ ప్రకారం, ఉద్యోగి పొందుతున్న మొత్తం వేతనం ఆధారంగా లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ మొత్తాన్ని లెక్కించాల్సి ఉంటుంది. అయితే ఇంటి అద్దె, ప్రయాణ ఖర్చులు, బోనస్ లాంటి వాటిని మాత్రం మినహాయించాల్సి ఉంటుంది. అయితే ఇవి కూడా ఉద్యోగి మొత్తం వేతనంలో 50 శాతానికి మించకూడదు.