తెలంగాణ

telangana

ETV Bharat / business

ఓయో బాస్​ ఇంట విషాదం.. మొన్న పెళ్లి.. నేడు తండ్రి అనుమానాస్పద మృతి - రితేశ్ అగర్వాల్ తండ్రి మరణం

ఓయో సంస్థ అధినేత రితేశ్​ అగర్వాల్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి రమేశ్ అగర్వాల్ ఓ భవనం 20వ అంతస్తు నుంచి పడి మరణించారు. ఈనెల 7నే రితేశ్​ వివాహమైంది. ఇంతలోనే ఇలా జరగడం వల్ల వారి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

oyo ceo marriage
ఓయో సీఈఓ తండ్రి కన్నుమూత

By

Published : Mar 10, 2023, 6:46 PM IST

Updated : Mar 10, 2023, 7:07 PM IST

ప్రముఖ హోటల్ ఫ్రాంచైజీ సంస్థ ఓయో వ్యవస్థాపకుడు, సీఈఓ రితేశ్​ అగర్వాల్​ తండ్రి రమేశ్​ అగర్వాల్​ మరణించారు. శుక్రవారం గురుగ్రామ్​లోని ఓ భవనం 20వ అంతస్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. పోస్ట్​మార్టం పరీక్షలు పూర్తయ్యాక రమేశ్​ అగర్వాల్ భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. గురుగ్రామ్​ తూర్పు డీసీపీ వీరేందర్​ విజ్ ఈ విషయాలు వెల్లడించారు.

"మృతుడి కుమారుడైన ఆశిష్ అగర్వాల్​ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. సీఆర్​పీసీ 174 సెక్షన్ ప్రకారం పంచనామా నిర్వహించారు. సెక్టార్​-53 పోలీస్ స్టేషన్​ హౌస్​ ఆఫీసర్.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గురుగ్రామ్​ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్​మార్టం పరీక్షలు నిర్వహించారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు" అని వీరేందర్ విజ్ వివరించారు.

ఆయనమే మాకు స్ఫూర్తి, బలం..
తండ్రి రమేశ్ అగర్వాల్ మరణంపై ఓ ప్రకటన విడుదల చేశారు ఓయో సంస్థ అధినేత రితేశ్ అగర్వాల్. "మా కుటుంబానికి స్ఫూర్తి ప్రదాత, బలం అయిన మా తండ్రి రమేశ్ అగర్వాల్ మార్చి 10న మరణించారని బరువెక్కిన హృదయంతో తెలియజేస్తున్నాం. ఆయన సంపూర్ణమైన జీవితం గడిపారు. నాకు, నాలాంటి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు. ఆయన మాటలు ఎప్పటికీ మా హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఈ విషాద సమయంలో మా కుటుంబ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని అందరినీ కోరుతున్నాం" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు రితేశ్ అగర్వాల్.

పెళ్లి ఆనందంలో ఉండగానే..
రితేశ్​ అగర్వాల్​ వివాహం ఈనెల 7న జరిగింది. దిల్లీలోని తాజ్ ప్యాలెస్​లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో గీతాన్షా సూద్​ను రితేశ్​ అగర్వాల్ పెళ్లి చేసుకున్నారు. జపాన్​కు చెందిన సాఫ్ట్​బ్యాంక్ గ్రూప్ వ్యవస్థాపకుడు మసాయోషి సన్​తోపాటు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్​ శర్మ వంటి వ్యాపార దిగ్గజాలు ఈ వివాహానికి హాజరయ్యారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్​ కూడా నవ దంపతుల్ని ఆశీర్వదించారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. రితేశ్​ అగర్వాల్ కుటుంబం పెళ్లి ఆనందంలో ఉండగానే.. అనూహ్యంగా శుక్రవారం ఆయన తండ్రి రమేశ్ అగర్వాల్​ దుర్మరణం చెందారు. ఫలితంగా వారంతా విషాదంలో మునిగిపోయారు.

అంకుర సంస్థగా వ్యాపార రంగంలో ప్రయాణం ప్రారంభించింది ఓయో. దేశవ్యాప్తంగా చౌకైన హోటల్​ సేవలు అందించడంలో తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసింది. భారత దేశంలోని 800 నగరాల్లో ఓయో ద్వారా హోటల్​ బుక్ చేసుకునే వీలు ఉంది. జపాన్​కు చెందిన సాఫ్ట్​బ్యాంక్ గ్రూప్.. భారతీయ స్టార్టప్ అయిన ఓయోలో భారీగా పెట్టుబడులు పెట్టింది. అందుకే సాఫ్ట్​బ్యాంక్ వ్యవస్థాపకుడు మసాయోషి సన్ ఇటీవల ఓయో సీఈఓ రితేశ్ అగర్వాల్ వివాహానికి హాజరయ్యారు.

Last Updated : Mar 10, 2023, 7:07 PM IST

ABOUT THE AUTHOR

...view details