స్మార్ట్‌ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకూ ఒకేరకమైన ఛార్జింగ్ పోర్ట్‌ను అమర్చడాన్ని దశలవారీగా అమల్లోకి తెచ్చేందుకు కంపెనీలు, పరిశ్రమ సంఘాలు అంగీకరించాయని వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. వేరబుల్స్‌కు కూడా ఒకే రకమైన ఛార్జింగ్ పోర్ట్‌ల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఒక ఉపకమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. వినియోగదారు వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన అంతర్ మంత్రిత్వ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎంఏఐటీ, ఫిక్కీ, సీఐఐ వంటి పరిశ్రమ సమాఖ్యలు, ఐఐటీ కాన్పూర్, ఐఐటీభూ వారణాసి తదితర విద్యా సంస్థల ప్రతినిధులు, పర్యావరణ మంత్రిత్వ శాఖతో పాటు పలు మంత్రిత్వ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలైన స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లకు యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌నే దశలవారీగా అమల్లోకి తీసుకొచ్చేందుకు పరిశ్రమల ప్రతినిధులు అంగీకరించారు. ఇందువల్ల ఇ-వ్యర్థాలు తగ్గుతాయి. ఫీచర్ ఫోన్లకు మాత్రం ప్రత్యేక పోర్ట్ ఉండనుంది.