OLA Electric Scooter Diwali Discounts 2023 :ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్.. 'భారత్ ఫెస్ట్' అనే పేరుతో సేల్‌ను నిర్వహిస్తోంది. అందులో భాగంగా దీపావళి సందర్భంగా అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఓలా స్కూటర్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్, బ్యాటరీ వారంటీ ప్రోగ్రాం, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు అందిస్తోంది. మొత్తంగా రూ.26,500 వరకు బెనిఫిట్స్ లభించే అవకాశం ఉంది. ఓలా.. పండగ ఆఫర్లపై మరిన్ని వివరాలు మీకోసం.
బ్యాటరీ వారంటీ..
కొన్ని నెలల క్రితం ఓలా.. సెకండ్ జెనరేషన్ ఎస్1 సిరీస్ స్కూటర్లను విడుదల చేసింది. ఇందులో కొన్ని కొత్త మోడళ్లతో పాటు వాటి రేంజ్‌ను అప్‌గ్రేడ్ చేసింది. దీపావళి సందర్భంగా వాటిపై ఆఫర్లు ప్రకటించింది. అందులో భాగంగా.. ఓలా ఎస్1 ప్రో (జెన్-2) మోడల్‌పై రూ.7,000 విలువగల బ్యాటరీ వారంటీని ఉచితంగా పొందొచ్చు. దీంతోపాటు ఎస్1 ఎయిర్, ఎస్1 X+ స్కూటర్ల బ్యాటరీ వారంటీపై 50 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇక ఇప్పటికే ఎస్1 ప్రో స్కూటర్‌ను కొనుగోలు చేసిన వారు రూ.9,000 విలుగల కాంప్రెహెన్సివ్ ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీని.. కేవలం రూ.2,000తో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
ఓలా ఎక్స్ఛేంజ్ ఆఫర్స్..
ఐసీ ఇంజిన్ స్కూటర్ ఎక్స్ఛేంజ్లపై కూడా ఓలా అదిరిపోయే బెనిఫిట్స్ అందిస్తోంది. అందులో భాగంగా ఐసీ ఇంజిన్ స్కూటర్ ఎక్స్ఛేంజ్ చేసి.. ఓలా ఎస్1 ప్రో కొనుగోలు చేస్తే.. రూ.10,000 వరకు బోనస్ అందిస్తోంది. ఇక ఎస్1 ఎయిర్, ఎస్1 X+ తీసుకున్న వారికి రూ.5,000 వరకు బోనస్ లభిస్తోంది.
వాయిదా పద్దతిలో వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి.. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ.7,500 వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. దీంతోపాటు జీరో డౌన్ పేమెంట్, నోకాస్ట్ ఈఎమ్ఐ, జీరో ప్రాసెసింగ్ ఫీజు, అతి తక్కువ 5.99 శాతం ఇంట్రెస్ట్ రేట్ వంటి ఆకర్షణీయమైన ఫైనాన్స్ బెనిఫిట్స్ కూడా కంపెనీ అందిస్తోంది.