చమురు విక్రయ సంస్థలు లీటర్ పెట్రోల్‌పై ప్రస్తుతం రూ.10 లాభం పొందుతున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది. అదే సమయంలో లీటర్ డీజిల్‌పై రూ.6.50 నష్టాన్ని భరిస్తున్నట్లు పేర్కొంది. పెట్రోల్‌పై లాభం వస్తున్నప్పటికీ రిటైల్ ధరల్ని మాత్రం కంపెనీలు తగ్గించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిల్లిన నష్టాలను.. ప్రస్తుతం వస్తున్న లాభాలతో భర్తీ చేసుకోవడానికే కంపెనీలు ధరల్ని తగ్గించడం లేదని నివేదిక తెలిపింది.
ప్రభుత్వ రంగ సంస్థలైన 'ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్', 'భారత్ పెట్రోలియం కార్పొరేషన్', 'హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్' గత 15 నెలలుగా అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను సవరించడం లేదు. ఈ వ్యవధిలో అంతర్జాతీయ విపణిలో ఓ దశలో ధరలు బాగా తగ్గిన సందర్భాలూ ఉన్నాయి. 2022 జూన్ 24తో ముగిసిన వారంలో కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై రూ.17.4, లీటర్ డీజిల్‌పై రూ.27.7 నష్టాన్ని చవిచూసినట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది. తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు క్రమంగా తగ్గడం వల్ల అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో లీటర్ పెట్రోల్‌పై రూ.10 లాభాన్ని ఆర్జించినట్లు వెల్లడించింది. లీటర్ డీజిల్‌పై నష్టం సైతం రూ. 6.5కు తగ్గినట్లు తెలిపింది.