OFFICE SPACE LEASE REPORT: కార్పొరేట్ల నుంచి గిరాకీ పెరగడంతో హైదరాబాద్ సహా, దేశ వ్యాప్తంగా ఆరు ప్రధాన నగరాల్లో కార్యాలయ స్థలాల లీజింగ్ పెరిగింది. ఏప్రిల్- జూన్‌లో హైదరాబాద్, దిల్లీ, బెంగళూరు, ముంబయి, చెన్నై, పుణె నగరాల్లో కలిపి మొత్తం 1.40 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని వివిధ సంస్థలు లీజుకు తీసుకున్నట్లు స్థిరాస్తి సేవల సంస్థ కొలియర్స్ ఇండియా పేర్కొంది. 2021 ఇదే కాలం నాటి లీజు విస్తీర్ణం 56 లక్షల చదరపు అడుగులతో పోలిస్తే ఇది దాదాపు 2.5 రెట్లు అని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి- జూన్‌లో చూస్తే, ఈ ఆరు ప్రధాన నగరాల్లో మొత్తం 2.75 కోట్ల చదరపు అడుగుల కార్యాలయ స్థలం లీజుకు వెళ్లింది. 2021 ఇదే కాలంలో ఈ మొత్తం 1.03 కోట్ల చదరపు అడుగులుగా ఉంది.
మూడు రెట్లు ఎక్కువగా...
హైదరాబాద్‌లో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 23 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. 2021 ఇదే కాలం నాటి లీజ్ 7 లక్షల చ.అ.తో పోలిస్తే, ఈసారి 3 రెట్లు అధికంగా వెళ్లింది. ఈ ఏడాది జనవరి- జూన్‌లో మొత్తం 45 లక్షల చ.అ. కార్యాలయ స్థలాన్ని కార్పొరేట్ సంస్థలు ఇక్కడ లీజుకు తీసుకున్నాయి. 2021 ఇదే కాలంలో ఇది 11 లక్షల చ.అడుగులేనని నివేదిక వెల్లడించింది.