తెలంగాణ

telangana

ETV Bharat / business

అసలు రూ.2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయా? - 2వేల నోటు

Rs 2000 currency notes continue to decline: మీరు చివరిసారిగా రూ.2వేల నోటును ఎప్పుడు చూశారు? కచ్చితంగా చాలా రోజులే అయ్యుంటుంది కదా! మరికొంత మందికైతే అసలు రూ.2వేల నోటు చలామణిలో ఉందా అనే అనుమానమూ కలుగుతోంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో తెలుసా?

2000 rupee note
Rs 2000 currency notes

By

Published : May 28, 2022, 4:28 AM IST

Rs 2000 currency notes continue to decline: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన రూ.2వేల నోటును క్రమక్రమంగా చలామణీలోంచి వెనక్కి తీసుకునేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే వీటి ముద్రణ ఆపేసిన కేంద్ర బ్యాంకు.. నోట్ల చలామణిని కూడా తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుతం చలామణిలో రూ.2వేల నోట్ల సంఖ్య 214 కోట్లకు తగ్గింది. దేశంలో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో వీటి పరిమాణం కేవలం 1.6శాతం మాత్రమే అని ఆర్‌బీఐ తన వార్షిక నివేదికలో వెల్లడించింది.

2021 మార్చి చివరి నాటికి దేశంలో 245 కోట్ల రూ.2వేల నోట్లు చలామణిలో ఉండగా.. ఈ ఏడాది మార్చి చివరి నాటికి వీటి సంఖ్య 214 కోట్లకు తగ్గినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. 2021 మార్చిలో అప్పటికి చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో వీటి పరిమాణం 2శాతం కాగా.. ఈ ఏడాది మార్చి నాటికి అది 1.6శాతం తగ్గినట్లు తెలిపింది. అలాగే, మొత్తం కరెన్సీ విలువలో రూ.2వేల నోట్ల విలువ 17.3శాతం నుంచి 13.8శాతానికి తగ్గినట్లు పేర్కొంది.

రూ.500నోట్ల చలామణి పెరిగింది..:ఇక ఇదే సమయంలో రూ.500 నోట్ల చలామణి మాత్రం విపరీతంగా పెరిగినట్లు ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది. 2021 మార్చి నాటికి 3,867.90కోట్ల రూ.500నోట్లు చలామణిలో ఉండగా.. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఆ సంఖ్య ఏకంగా రూ.4,554.68 కోట్లకు పెరిగింది. దేశంలో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో వీటి పరిమాణమే(34.9శాతం) ఎక్కువ. ఆ తర్వాత 21.3శాతంతో రూ.10 నోట్లు ఎక్కువగా చలామణి అవుతున్నాయి. ఇక, మొత్తం కరెన్సీ విలువలో రూ.500నోట్ల విలువ 73.3శాతానికి పెరిగిందని నివేదిక వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్ల సంఖ్య 13,053 కోట్లు కాగా.. వాటి మొత్తం విలువ రూ.31.05లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్‌బీఐ నివేదికలో తెలిపింది.

నల్లధనాన్ని నిరోధించడంలో భాగంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు 2016 నవంబరు 8న కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రూ.2వేల నోట్లను ప్రవేశపెట్టింది. క్రమంగా రూ.500, రూ.200 కొత్త నోట్లను కూడా చలామణీలోకి తెచ్చింది. అయితే 2018-19 నుంచి రూ.2వేల నోట్ల ముద్రణను కేంద్రం నిలిపివేసింది.

ఇదీ చూడండి:సీబీఐ నా రహస్య పత్రాలను తీసుకెళ్లింది: కార్తీ చిదంబరం

ABOUT THE AUTHOR

...view details