NPS New Rule : ఎన్‌పీఎస్, అటల్ పెన్షన్ యోజన, ఎన్‌పీఎస్ లైట్ చందాదారులకు అలర్ట్. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA).. పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) చందాదారులకు సరైన సమయంలో, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిధులు జమయ్యేలా చేయడం కోసమే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో ఇకపై బ్యాంకు ఖాతా వివరాల తక్షణ తనిఖీ తప్పనిసరి అయ్యింది.
పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్ అంటే ఏమిటి?
What Is Penny Drop Verification : ఎన్‌పీఎస్ చందాదారుల పొదుపు ఖాతా స్థితి, వివరాలను తనిఖీ చేయడానికి ‘సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలు ఉపయోగించే పద్ధతినే ‘పెన్నీ డ్రాప్’ వెరిఫికేషన్ అంటారు. మీరు సమర్పించిన ‘పర్మనెంట్ రిటైర్‌మెంట్ అకౌంట్ నెంబర్ (PRAN)’ సహా ఇతర పత్రాల్లో ఉన్న వివరాలు.. బ్యాంకు ఖాతాలో ఉన్న వివరాలు ఓకేలా ఉన్నాయా? లేదా? అనేది ఈ విధానంలో పరిశీలిస్తారు. ఎన్‌పీఎస్, అటల్ పెన్షన్ యోజన, ఎన్‌పీఎస్ లైట్ చందాదారులకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. ఎన్‌పీఎస్ నుంచి పాక్షిక నిధుల ఉపసంహరణ, ఎన్‌పీఎస్ నుంచి మధ్యలో వైదొలగడం, బ్యాంకు ఖాతా వివరాల్లో మార్పు లాంటి వాటి కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఈ పెన్నీ డ్రాప్ పద్ధతి ద్వారా వివరాలను ధ్రువీకరించుకుంటారు.
టెస్ట్ ట్రాన్సాక్షన్
పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్‌లో భాగంగా మీ బ్యాంకు ఖాతా యాక్టివ్‌గా ఉందో? లేదో? తెలుసుకోవడానికి తొలుత టెస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తారు. అంటే చిన్న మొత్తంలో డబ్బును ఖాతాదారుని బ్యాంకు అకౌంట్లో జమ చేస్తారు. అదే సమయంలో ఖాతాదారుని పేరు సహా ఇతర వివరాలు సరిపోలాయో? లేదో? చెక్ చేస్తారు. సరళంగా చెప్పాలంటే, ఎన్‌పీఎస్ నిధులు జమ కావాలంటే.. పెన్నీ డ్రాప్ విధానంలో బ్యాంకు ఖాతాను కచ్చితంగా వెరిఫై చేసుకోవాలి.