అదానీ గ్రూప్‌లో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ గ్రూప్ సంస్థల్లో వాటాలన్నీ విక్రయించినట్లు ఒక నార్వే ఫండ్ ప్రకటించింది. గతేడాది చివరకు అదానీ గ్రీన్‌ఎనర్జీలో 52.7 మిలియన్ డాలర్లు; అదానీ టోటల్ గ్యాస్‌లో 83.6 మి. డాలర్లు; అదానీ పోర్ట్స్‌లో 63.4 బి. డాలర్ల విలువైన వాటాలను నార్వేజియన్ ఫండ్ కలిగి ఉంది.ఈ షేర్లన్నింటినీ ఇటీవల విక్రయించినట్లు స్పష్టం చేసింది.
- అదానీ గ్రూప్ రుణాలన్నీ కలిపితే రూ.3.39 లక్షల కోట్లు అవుతాయని, ఇవి భారత ఆర్థిక వ్యవస్థలో 1.2 శాతానికి సమానమని, నిక్కీ ఆసియా విశ్లేషించింది. భారత నామినల్ జీడీపీ గత అక్టోబరు ఆఖరుకు రూ.273 లక్షల కోట్లని గుర్తు చేసింది.
- అదానీ గ్రూప్‌లోని 10 సంస్థలకు కలిపి రూ.4.8 లక్షల కోట్ల ఆస్తులున్నాయని, అయితే రుణాలపై మదుపర్లకు ఆందోళనలు కొనసాగుతున్నాయని విశ్లేషించింది.
విచారణకు సుప్రీం కోర్టు అంగీకారం: అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వెలువరించిన నివేదికపై ఒక పదవీ విరమణ పొందిన న్యాయమూర్తితో కమిటీ ఏర్పాటు చేసి, దర్యాప్తు చేయడానికి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన విజ్ఞప్తిపై విచారణ చేపట్టడానికి సుప్రీం కోర్టు అంగీకారం తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
వెయిటేజీ సమీక్ష నేపథ్యంలో..:ఎంఎస్‌సీఐ సూచీల్లో అదానీ గ్రూప్ కంపెనీల వెయిటేజీని పునఃసమీక్షించాలని నిర్ణయించడంతో, షేర్లు మళ్లీ డీలాపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 10.72% కోల్పోయి రూ.1927.30 వద్ద; అదానీ పోర్ట్స్ 2.90% తగ్గి రూ.582.05 వద్ద ముగిశాయి. అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్ లోయర్ సర్క్యూట్ అయిన 5% నష్టాన్ని చవిచూశాయి. అంబుజా 6.86%, ఎన్‌డీటీవీ 4.98%, ఏసీసీ 2.91% నష్టపోయాయి. అదానీ విల్మర్ 5% రాణించింది. హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడిన (జనవరి 24 నుంచి) ఇప్పటివరకు అదానీ కంపెనీల మార్కెట్ విలువ రూ.9.4 లక్షల కోట్లు ఆవిరైంది.