PAN Aadhaar Link: పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవడానికి మార్చి 31(గురువారం) చివరితేదీ. రెండింటినీ అనుసంధానం చేసుకోని వినియోగదారులు, పన్ను చెల్లింపుదారులు త్వరగా ఆ పని పూర్తిచేసుకోవాలని స్పష్టం చేసింది ఆదాయపు పన్ను శాఖ. నిర్ణీత గడువులోగా పాన్- ఆధార్ లింక్ చేయకుంటే.. ఆలస్య రుసుము కింద రూ. 500 నుంచి రూ. 1000 వరకు జరినామా చెల్లించాల్సి ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. ఇంకా.. పాన్ కార్డు (ఇనాక్టివ్) పనిచేయదని స్పష్టం చేసింది. 2022 జూన్ 22లోగా ఈ ప్రక్రియ పూర్తిచేసినట్లయితే ఫైన్ కింద రూ. 500 వసూలు చేయనున్నట్లు పేర్కొంది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ). ఆ తర్వాత జరిమానా మరింత పెరగనున్నట్లు తెలిపింది.
''2022, మార్చి 31లోగా ఆధార్‌తో పాన్ కార్డును అనుసంధానం చేయకుంటే.. అది పనిచేయకుండా పోతుంది. పెనాల్టీ కట్టిన తర్వాత మళ్లీ పనిచేస్తుంది.'' అని సీబీడీటీ మార్చి 29న ఓ ప్రకటన విడుదల చేసింది. ఆధార్-పాన్ అనుసంధానం కోసం కేంద్రం పలుమార్లు గడువు పొడిగిస్తూ వచ్చిందని, ఇప్పుడు తొలిసారి ఆలస్య రుసుముకు సంబంధించి ప్రకటన వెలువరిచిందని అన్నారు ఏకేఎం గ్లోబల్, ట్యాక్స్ పార్ట్నర్ అమిత్ మహేశ్వరి. మొదటి 3 నెలల వరకు అంటే ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు రూ. 500, ఆ తర్వాత రూ. 1000 చొప్పున ఫైన్ ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ సేవలు పొందాలంటే?: బ్యాంకింగ్ సేవలను పొందడం, డెబిట్, క్రెడిట్ కార్డులను వాడడం, ఆన్‌లైన్ చెల్లింపులు, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ ఇలాంటి సేవలన్నీ ఎలాంటి అవాంతరం లేకుండా పొందాలంటే.. మీ పాన్‌ను ఆధార్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలి. లేదంటే ఈ సేవలకు విఘాతం కలిగే ఆస్కారం ఉంది. దీంతోపాటు.. మీకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వచ్చే వడ్డీ, డివిడెండు, ఇతర ఆదాయాలపైనా అధిక మొత్తంలో పన్ను కోత విధించే అవకాశం ఉంది. ఒకసారి ఇలా విధించిన పన్నును తిరిగి వెనక్కి తీసుకునే అవకాశమూ ఉండదు.
పాన్‌తో ఆధార్ అనుసంధానం ఇలా..
1. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ తెరవండి.
2. మొదటిసారి లాగిన్ అయ్యే వారు రిజిస్టర్ చేసుకోవాలి. మీ పాన్ నెంబరే(శాశ్వత ఖాతా సంఖ్య) మీ యూజర్ ఐడీ అవుతుంది.3. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ అవ్వండి.
4. ఆధార్-పాన్ లింక్ కోసం ఒక పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది.
5. పాన్ కార్డులోని వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీ వంటి సమాచారం కనిపిస్తుంది.