Nokia Layoffs 2023 : ప్రముఖ టెక్ దిగ్గజం నోకియా తమ ఉద్యోగులకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యయ నియంత్రణలో భాగంగా 14 వేల మంది సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు సిద్ధపడినట్లు గురువారం ప్రకటించింది. అయితే ఈ తొలగింపులు దశలవారీగా ఉంటాయని సంస్థ తెలిపింది. కాగా, తొలగించనున్న ఉద్యోగుల సంఖ్య కంపెనీలోని మొత్తం సిబ్బందిలో 16 శాతం.
ఇదే కారణమా?
నోకియా కంపెనీకి ఉత్తర అమెరికా మార్కెట్ అత్యంత కీలకం. ఇక్కడ ఈ సంస్థకు భారీ ఎత్తున వ్యాపారం జరుగుతుంటుంది. అయితే ఇటీవల ఈ కంపెనీకి చెందిన 5జీ పరికరాలకు ఇక్కడ డిమాండ్ భారీగా పడిపోయింది. దీంతో ఈ ఏడాది మూడో త్రైమాసికంలో సంస్థ విక్రయాలు 20 శాతం మేర తగ్గాయి. దీని ఫలితంగానే కంపెనీ తన ఖర్చుల్ని తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకుంది. 2026 నాటికి 800 మిలియన్ యూరోల నుంచి 1.2 బిలియన్ యూరోల మేరకు వ్యయాన్ని నియంత్రించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ తాజా నిర్ణయంతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 86 వేల నుంచి 72 వేలకు తగ్గనున్నట్లు పేర్కొంది.
"వచ్చే ఏడాదిలో 400 మిలియన్ల యూరోలు, 2025లో 300 మిలియన్ల యూరోల వరకు ఖర్చును తగ్గించుకోవాలని అనుకుంటున్నాం. మూడో త్రైమాసికంలో అమ్మకాలు తగ్గాయి. అయినా రానున్న త్రైమాసికంలో విక్రయాలు పెరగుతాయని భావిస్తున్నాం"
- పెక్కా లాండ్‌మార్క్, కంపెనీ సీఈఓ