Nitin Gadkari EV: విద్యుత్ వాహనాల్లో మంటలు చెలరేగడం, బ్యాటరీలు పేలిపోవడం వంటి ఘటనలపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. విద్యుత్ వాహనాల తయారీలో తప్పక నాణ్యత పాటించాలని సూచించారు. లేకుంటే భారీ జరిమానాలు విధిస్తామన్నారు. దాంతోపాటు వాహనాలను రీకాల్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. వాహనదారుల భద్రతకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం వరుస ట్వీట్లు చేశారు.
ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం రాయితీ ఇస్తుండటంతో వీటి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే, ఇటీవల కాలంలో విద్యుత్ వాహనాల్లో మంటలు చెలరేగడం, బ్యాటరీలు పేలిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా నిజామాబాద్‌లో కూడా విద్యుత్తు వాహనం బ్యాటరీ పేలి ఒకరు మరణించారు. ఈ నేపథ్యంలోనే గడ్కరీ స్పందించారు. గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న 'ఈవీ పేలుడు' ఘటనలు తన దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. వీటిలో కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడినట్లు మంత్రి తెలిపారు.