Nirmala Sitharaman US: అమెరికా దిగ్గజ సంస్థలైన ఫెడెక్స్, మాస్టర్‌కార్డ్ సీఈఓలతో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో పెట్టుబడులకు గల అవకాశాలను వారితో చర్చించారు. 2022 ఐఎంఎఫ్- ప్రపంచబ్యాంక్ సమావేశాలకు హాజరయ్యేందుకు నిర్మలా సీతారామన్ అమెరికా వెళ్లిన సంగతి విదితమే. భారత్‌పై సానుకూలంగా ఉన్నామని, నైపుణ్యాలు సహా విస్తరణ ప్రణాళికలు ఉన్నట్లు ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఫెడెక్స్ అధ్యక్షుడు, సీఈఓ రాజ్ సుబ్రమణియమ్ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి గతి శక్తి పథకం ద్వారా సమీకృత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉండటాన్ని ప్రశంసించారు. భారత్‌లో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కేంద్రాల ఏర్పాటుకు చూస్తున్నామని, భారత్‌లో ఎదిగేందుకు గొప్ప అవకాశాలు ఉన్నాయన్నారు. భారత్‌లో తయారీ వ్యూహానికి బడ్జెట్‌లో ప్రకటించిన జాతీయ లాజిస్టిక్స్ విధానం కీలక పాత్ర పోషిస్తుందని సుబ్రమణియమ్ అభిప్రాయపడ్డారు.
యాక్సెంచర్ ఛైర్, సీఈఓ జూలీ స్వీట్‌తో కూడా సీతారామన్ భేటీ అయ్యారు. భారత్‌లో ద్వితీయ శ్రేణి నగరాల్లో యాక్సెంచర్ విస్తరిస్తోందని, వర్థమాన అవకాశాలు ఒడిసిపట్టేందుకు అవసరమైన నైపుణ్యాలపై దృష్టి పెట్టినట్లు ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. మాస్టర్ కార్డ్ సీఈఓ మైబ్యాచ్ మైఖేల్, డెలాయిట్ గ్లోబల్ సీఈఓ పునీత్ రంజన్‌లతో కూడా ఆర్థిక మంత్రి సమావేశమయ్యారు. మాస్టర్ కార్డ్ భారత్‌లో ఏర్పాటు చేయనున్న డేటా కేంద్రాలపై చర్చించారు. భారత్ పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉందని రంజన్ అన్నారు.