New Rules in 2024: 2023కు గుడ్‌బై చెప్పి.. 2024కి వెల్కమ్ చెప్పాం. ఈ క్రమంలో కొత్త ఏడాది తొలిరోజు నుంచే కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. బీమా పాలసీలు, సిమ్ కార్డులు, యూపీఐ, వ్యక్తిగత ఫైనాన్స్ విషయంలో కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
సిమ్ కార్డుల కొనుగోలు, అమ్మకం:కొత్త టెలికాం బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత సిమ్ కార్డుల కొనుగోలు, నిర్వహణ, వాటిని విక్రయించే పద్ధతులు మారనున్నాయి. 2023లో పెరిగిన స్పామ్, సైబర్ స్కామ్‌లు, ఆన్‌లైన్ ఫ్రాడ్స్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సిమ్ కార్డుల కొనుగోలు ప్రక్రియలో ఈ గణనీయమైన మార్పులు జనవరి 1, 2024 నుంచి అమలుల్లోకి వచ్చాయి.
బీమా సమగ్ర పాలసీ ఫీచర్ వివరాలు:నూతన సంవత్సరంలో బీమా కంపెనీలు తమ పాలసీదారులకు కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (CIS)ని అందజేస్తాయని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) తెలిపింది. సంక్లిష్ట పాలసీ వివరాలను సరళీకృతం చేయడానికి, పాలసీదారులకు వారి బీమా కవరేజీపై అవగాహనను అందించే ప్రయత్నంలో ఈ షీట్‌ను రూపొందించారు. ఇందులో భాగంగా బీమా మొత్తం, కవరేజీ ప్రత్యేకతలు, మినహాయింపులు, క్లెయిమ్‌ల ప్రక్రియ వంటి ముఖ్యమైన పాలసీ వివరాలను బీమా కంపెనీలు పాలసీదారులకు అందజేస్తాయి. కాగా సవరించిన కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్లు (CIS) జనవరి 1 నుంచే అమలులోకి వచ్చాయి.
సైబర్ మోసానికి గురయ్యారా? సింపుల్‌గా కంప్లైంట్ చేయండిలా!
మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాదారుల నామినేషన్ గడువు:మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ కస్టమర్స్ జూన్ 30, 2024లోపు లబ్ధిదారుని నామినేట్ చేయాలి. లేదా దాని నుంచి వైదొలగాలి. ఇన్వెస్టర్లు నామినేషన్ గడువును కోల్పోతే, సెబీ వారి హోల్డింగ్‌ల నుంచి డెబిట్‌లను స్తంభింపజేయవచ్చు. దీని అర్థం పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఉపసంహరించుకోలేరు లేదా ట్రేడింగ్ కోసం వారి డీమ్యాట్ ఖాతాలను ఉపయోగించలేరు.
ఫ్రీ ఆధార్ అప్‌డేట్:భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మార్చి 14, 2024 వరకు ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి అనుమతించింది. అయితే myAadhaar పోర్టల్‌లో మాత్రమే సేవలు ఫ్రీ. ఫిజికల్ ఆధార్ కేంద్రాల్లో కార్డుదారులు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.