తెలంగాణ

telangana

ETV Bharat / business

Bank Locker New Rules  : లాకర్ల గురించి ఈ 5 రూల్స్​ తప్పక తెలుసుకోండి! - కొత్త బ్యాంక్​ లాకర్​ రూల్స్​

Bank Locker New Rules 2023 : మీరు బ్యాంక్​ లాకర్​ను కలిగి ఉన్నారా? అందులో చాలా విలువైన వస్తువులు, నగలు దాచుకున్నారా? అయితే తప్పకుండా కొత్త 'బ్యాంక్​ లాకర్​ రూల్స్' గురించి తెలుసుకోండి. పూర్తి కథనం మీ కోసం..

bank locker rules 2023
బ్యాంక్​ లాకర్​ నిబంధనలు 2023

By

Published : Jun 7, 2023, 9:27 AM IST

Updated : Jun 7, 2023, 11:47 AM IST

Bank Locker New Rules 2023 :రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశం మేరకు బ్యాంకులు తమ లాకర్​ నిబంధనలను మార్పులు, చేర్పులు చేస్తున్నాయి. ఈ మేరకు కస్టమర్లకు కూడా సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇప్పటికే రివైజ్డ్​ లాకర్​ అగ్రిమెంట్​పైన సంతకం చేసినవారు, సప్లమెంటరీ అగ్రిమెంట్​పై కూడా సంతకం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి బ్యాంకులు.

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్​బీఐ ఇప్పటికే తన కస్టమర్లకు సవరించిన బ్యాంక్​ లాకర్ రూల్స్​ గురించి, దాని సప్లమెంటరీ అగ్రిమెంట్​ గురించి సమాచారాన్ని అందిస్తోంది. ఈ జూన్​ 30లోగా వీటిపై కచ్చితంగా కస్టమర్లు సంతకాలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. బ్యాంక్​ ఆఫ్​ బరోడా కూడా ఇదే మార్గంలో పయనిస్తోంది. ఆర్​బీఐ నిర్దేశం మేరకు మిగతా బ్యాంకులు తప్పనిసరిగా ఈ మేరకు సమాచారం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇందుకోసం 2023 డిసెంబర్​ నెలాఖరు వరకు సమయం ఉంది.

రివైజ్డ్​ బ్యాంక్​ లాకర్ రూల్స్​​ విషయంలో ఆర్​బీఐ కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అవేంటో తెలుసుకుందాం.

1. స్టాంప్​ పేపర్​పై అగ్రిమెంట్​
బ్యాంక్​ లాకర్​ అగ్రిమెంట్​ కచ్చితంగా స్టాంప్​ పేపర్​పై రాసుకుని ఉండాలి. దీనిని కూడా బ్యాంకులు తమ కస్టమర్లకు ఉచితంగా అందించాలి. దీని వల్ల లాకర్​ హోల్డర్లకు తగిన భద్రత చేకూరుతుంది.

'స్టాంప్​ పేపర్​ సమకూర్చడం, ఎలక్ట్రానిక్​ ఎగ్జిక్యూషన్​ ఆఫ్​ అగ్రిమెంట్​, ఈ-స్టాంపింగ్​, ఫ్రాంకింగ్​ అన్నీ బ్యాంకులే చూసుకోవాలి. తరువాత ఎగ్జిక్యూటెడ్​ అగ్రిమెంట్​ కాపీని కస్టమర్లకు ఉచితంగా అందించాలి.'

- ఆర్​బీఐ సర్క్యులర్​, జనవరి 24, 2023

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు కస్టమర్లనే రూ.20 విలువ గల స్టాంపు పేపర్లను తీసుకురావాలని, కొన్ని ప్రైవేట్​ బ్యాంకులు రూ.100 విలువ గల స్టాంపు పేపర్లను తెచ్చుకోవాలని సూచిస్తున్నాయి. అంటే ఇక్కడ స్టాంపుల డినామినేషన్ విలువ ఎంత ఉండాలన్నదానిపై అటు బ్యాంకులకు, ఇటు కస్టమర్లకు కూడా సరైన అవగాహన లేదని తెలుస్తోంది.

వాస్తవానికి బ్యాంక్ లాకర్​ అగ్రిమెంట్​ ఒరిజినల్​ కాపీ బ్యాంకులు తమ వద్ద ఉంచుకుని, తమ కస్టమర్లకు ఆ అగ్రిమెంట్ నకలు కాపీని ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలా వరకు బ్యాంకులు దీనిని పాటించడం లేదు. అందుకే ఆర్​బీఐ ఇప్పుడు బ్యాంక్​ లాకర్​ అగ్రిమెంట్​ కాపీని కచ్చితంగా లాకర్​ హోల్డర్లకు ఇవ్వాలని నిర్దేశించింది.

కస్టమర్లు మాత్రం రివైజ్డ్​ బ్యాంక్​ లాకర్​ అగ్రిమెంట్​ను పూర్తిగా చదివిన తరువాత మాత్రమే దానిపై సంతకం చేయాలి. ఒక వేళ బ్యాంకు నిబంధనలు తమకు సమ్మతం కాకపోతే, ఆర్​బీఐ గైడ్​లైన్స్​ గురించి బ్యాంకు అధికారులతో కచ్చితంగా చర్చించండి. ఈ విషయంలో మొహమాటపడకండి.

FDs for the locker :
బ్యాంకులు కస్టమర్లకు లాకర్లను అలాట్​మెంట్​ చేసేటప్పుడు కొంత మొత్తాన్ని ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేయమంటాయి. కనీసం మూడు సంవత్సరాలకు సరిపడా లాకర్​ అద్దె, ఒక వేళ లాకర్​ను విరగ్గొట్టాల్సి వచ్చినప్పుడు ఛార్జీలను వసూలు చేసుకోగలిగే స్థాయిలో ఈ ఫిక్స్​డ్​ డిపాజిట్​ ఉంటుంది.

లాకర్​ హోల్డర్లు ఒక వేళ వాటిని ఉపయోగించకుండా వదిలేసినా లేదా అద్దె చెల్లించకపోయినా ఈ ఫిక్స్​డ్​ డిపాజిట్​ నుంచి బ్యాంకులు తమకు రావాల్సిన రుసుములను మినహాయించుకుంటాయి. కానీ మంచి ట్రాక్​ రికార్డ్ ఉన్న కస్టమర్ల లాకర్లను మాత్రం బ్రేక్​ చేయడానికి బ్యాంకులకు ఎలాంటి అధికారం ఉండదు. బ్యాంకులు లాకర్లను అలాట్​ చేసేటప్పుడే అడ్వాన్స్​గా మొత్తం అద్దెను వసూలు చేస్తాయి. కానీ ఒక వేళ కస్టమర్​ మధ్యలోనే లాకర్​ను సరెండర్​ చేసినట్లయితే, బ్యాంకులు ఆ మేరకు మాత్రమే అద్దెను ఉంచుకొని, మిగతా సొమ్ము కస్టమర్​కు రిఫండ్​ చేయాల్సి ఉంటుంది.

ఈ విషయాల్లో బ్యాంకులు బాధ్యత వహించవు!
Discharge from liability:భారీ వర్షాలు, వరదలు, భూకంపాలు, పిడుగులు, పౌర ఆందోళనలు, అల్లర్లు, తీవ్రవాదదాడులు, మరీ ముఖ్యంగా కస్టమర్ల నిర్లక్ష్యం కారణంగా బ్యాంకు లాకర్లలోని వస్తువులు గానీ, నగలు గానీ పోయినా, దెబ్బతిన్నా అందుకు బ్యాంకులు బాధ్యత వహించవు.

అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు జరిగితే?
అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు, దోపిడీలు జరిగినా, ప్రమాదవశాత్తు బ్యాంకు ఉన్న భవనం కూలిపోయినా.. అందుకు బ్యాంకులే బాధ్యత వహించి నష్టపోయిన లాకర్​ హోల్డర్లకు పరిహారం అందించాలి. అంతే కాకుండా బ్యాంకు నిర్లక్ష్యం వల్ల లేదా బ్యాంకులోని ఉద్యోగుల మోసపూరిత కార్యకలాపాల వల్ల లాకర్లలోని వస్తువులు పోతే అందుకు కూడా బ్యాంకులే బాధ్యత వహించాలి. వాస్తవానికి ల్యాకర్​ డ్యామేజ్​ అయితే లాకర్​ హోల్డర్​ కట్టిన సంవత్సర అద్దెకి, బ్యాంకులు 100 రెట్లు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

లాకర్​ సేఫ్టీ కోసం ఇలా చేయండి?
బ్యాంకులో మీ ఈ-మెయిల్​ ఐడీ, మొబైల్​ నెంబర్​ నమోదు చేసుకోండి. లాకర్​ను మీరు ఉపయోగించినప్పుడు, ఆ తేదీని, సమయాన్ని బ్యాంకులు మీకు ఈ-మెయిల్ ద్వారా, ఎస్​ఎమ్​ఎస్​ ద్వారా తెలియజేస్తాయి. ఒక వేళ మీరు కాకుండా ఎవరైనా అనధికారికంగా మీ లాకర్​ను తెరవాలని ప్రయత్నిస్తే, వెంటనే మీకు అలర్ట్​ వచ్చేస్తుంది. అప్పుడు మీరు బ్యాంకు అధికారులను అప్రమత్తం చేసి మీ విలువైన వస్తువులను కాపాడుకోవచ్చు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 7, 2023, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details