NPS Scheme Benefits :పదవీ విరమణ ప్రణాళిక గురించి ఆలోచించే ప్రతి ఒక్కరికీ కనిపించే మొదటి ఆప్షన్ నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్). ఇది కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కావడం వల్ల ఇన్వెస్టర్లు చేసే మదుపునకు కచ్చితంగా గ్యారెంటీ ఉంటుంది. కేవలం కొద్ది మొత్తాల్లో మదుపు చేసి, రిటైర్మెంట్ తరువాత భారీ మొత్తం పెన్షన్ పొందడానికి ఎన్పీఎస్ అవకాశం కల్పిస్తోంది.
ఎన్పీఎస్ ఇటీవల సరికొత్త వెబ్‌సైట్‌ను లాంఛ్ చేసింది. దీని ద్వారా మీరు ఎన్పీఎస్ స్కీమ్ బెనిఫిట్స్, రిటర్న్స్ అన్నీ ముందే చూసుకోవచ్చు. ముఖ్యంగా దీనిలో పొందుపర్చిన ఎన్పీఎస్ కాలిక్యులేటర్ ద్వారా ఎంత మొత్తం మదుపు చేస్తే, ఎంత మేరకు పెన్షన్ వస్తుందో చాలా సులభంగా లెక్కించవచ్చు.
25 ఏళ్లకే ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే!
Early Investment Opportunities : ఒక వ్యక్తి తనకు 75 ఏళ్లు వచ్చే వరకు ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఉదాహరణకు మీకు 25 ఏళ్లు అనుకుందాం. మీరు ప్రతి నెలా రూ.1500 చొప్పున ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారని అనుకుందాం. అంటే మీరు రోజుకు కేవలం రూ.50 మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నట్లు లెక్క. ఒక వేళ మీరు 60 ఏళ్లకు ఉద్యోగ విరమణ చేసినట్లయితే.. అప్పుడు సుమారుగా 10 శాతం వడ్డీ చొప్పున మీకు అక్షరాల రూ.57,42,416 వస్తుంది.
ఎన్పీఎస్ పథకం నుంచి నిష్క్రమించే సమయంలోనే.. పెట్టుబడిదారులు తమకు వచ్చిన 100 శాతం కార్పస్‌తో యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇలా యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే.. అతనికి నెలవారీగా రూ.28,712 చొప్పున పెన్షన్ అందుతుంది.
ఒక వేళ చందాదారుడు తన కార్పస్ నుంచి 40 శాతం మాత్రమే ఉపయోగించి యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే, అప్పుడు అతనికి నెలవారీగా సుమారుగా రూ.11,485 పెన్షన్ వస్తుంది. అలాగే లప్సమ్గా రూ.34 లక్షల వరకు చేతికి అందుతుంది.
నెలకు రూ.3000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే?
NPS Scheme Investment : ఒక వేళ 25 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.3000 చొప్పున ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాడని అనుకుందాం. అంటే అతను రోజుకు కేవలం రూ.100 పెట్టుబడి పెడుతున్నట్లు లెక్క. కానీ అతనికి 60 ఏళ్లు వచ్చే నాటికి కేవలం 10 శాతం వడ్డీ రేటు చొప్పున గణించినా, మొత్తంగా రూ.1,14,84,831 భారీ కార్పస్ అందుతుంది. ఈ సమయంలో అతను తన 100 శాతం కార్పస్‌తో యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేసినట్లయితే.. అతనికి నెలనెలా రూ.57,412 చొప్పున పెన్షన్ అందుతుంది.
ఒక వేళ ఆ చందాదారుడు తన కార్పస్‌లోని 40 శాతం డబ్బుతో యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేసినట్లయితే, అతనికి నెలవారీగా రూ.22,970 పెన్షన్ అందుతుంది. అలాగే రూ.68 లక్షల కార్పస్ చేతికి అందుతుంది.
ఎన్‌పీఎస్‌లో 10 శాతం యాన్యువల్ రిటర్నులు కచ్చితంగా వస్తాయా?
NPS Annuity Calculator : వాస్తవానికి ఎన్‌పీఎస్‌లో వార్షిక రిటర్నులు 10 శాతానికి కొంచెం అటూఇటూగా ఉంటాయి. ఎందుకంటే ఈ ఎన్పీఎస్ స్కీమ్.. మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ ఇస్తుంది. అంతేకాదు ఎన్‌పీఎస్‌లో మీరు ఎంచుకున్న స్కీమ్‌ను అనుసరించి, దాని ఫండ్ మేనేజర్‌ను అనుసరించి కూడా ఈ రిటర్నులు మారుతూ ఉంటాయి.
ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం, ఈక్విటీ కేటగిరీలోని ఎన్పీఎస్ స్కీమ్‌ల్లో దాదాపు 13 శాతం వరకు రిటర్నులు వచ్చాయి. అలాగే ఈ రిటర్నులు 9 శాతం కంటే తగ్గే అవకాశాలు కూడా చాలా తక్కువ.
ఎన్పీఎస్ రిటర్నులు లెక్కించడం ఎలా?
NPS Return Calculator : ఎన్పీఎస్ రిటర్నులను లెక్కించడం చాలా సులభం. ముందుగా ఎన్పీఎస్ కాలిక్యులేటర్‌ను ఓపెన్ చేసి, మీ పుట్టిన తేదీ, నెలవారీగా మీరు చెల్చించే కంట్రిబ్యూషన్, కంట్రిబ్యూషన్ చేసిన టోటల్ ఇయర్స్, మీరు ఊహిస్తున్న రిటర్నుల శాతాన్ని నమోదు చేయాలి. అంతే రిటైర్మెంట్ సమయానికి మీకు ఎంత కార్పస్ క్రియేట్ అవుతుందో చాలా సులువుగా తెలుసుకోవచ్చు.
గమనిక :పైన తెలిపిన సమాచారం కేవలం అవగాహన కల్పించడం కోసం మాత్రమే. మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణులను సంప్రదించడం ఉత్తమం.