కొవిడ్ పరిణామాల ఫలితంగా సొంత కార్లకు గిరాకీ అనూహ్యంగా పెరిగింది. కొత్త కారు కొందామన్నా, వారాలు-నెలల తరబడి సరఫరా చేయలేని స్థితిని కంపెనీలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు చూస్తే, కొన్ని మోడళ్లకు గిరాకీ ఉన్నా.. రూ.10,000 నుంచి రూ.లక్ష వరకు రాయితీని కార్ల డీలర్లు ప్రకటిస్తున్నారు. 'ఇప్పుడూ గిరాకీ ఉన్నా, వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న బీఎస్ 6 రెండో దశ (బీఎస్ 6.2) కాలుష్య ఉద్గార నిబంధనల లోపు, పాత నిల్వలు విక్రయించేందుకే సంస్థలు రాయితీలు ఇస్తున్నాయ'ని ఫ్రెంచ్ సంస్థ రెనో అనుబంధ రెనో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మామిళ్లపల్లి వెంకట్రామ్ తెలిపారు. మూడేళ్ల క్రితం బీఎస్ 4 నుంచి బీఎస్6 తొలిదశ (బీఎస్ 6.1)కు మారినప్పుడు నెలకొన్న పరిస్థితులే, ఇప్పుడూ ఏర్పడ్డాయని 'ఈటీవీ భారత్' ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ముఖ్యాంశాలివీ..
వినియోగదార్లకు ఇంకా కంపెనీలు అందించాల్సిన కార్ల సంఖ్య 7.50 లక్షలని చెబుతున్నారు. అంత గిరాకీ ఉంటే రాయితీలు ఎందుకు ఇస్తున్నారు?
కార్లు, వ్యాన్లు, ఎస్‌యూవీలు (ప్రయాణికుల వాహనాలు) కలిపి గత 6 నెలలుగా ప్రతినెలా 3 లక్షల పైనే కంపెనీల నుంచి డీలర్లకు (టోకు విక్రయాలు) చేరుతున్నాయి. డీలర్ల వద్ద రిటైల్ విక్రయాలు చోటుచేసుకుంటాయి. ఈ ఏడాది మొత్తమీద 38 లక్షల ప్రయాణికుల వాహనాల టోకు విక్రయాలు జరగొచ్చని అంచనా. ప్రతినెలా కొత్త ఆర్డర్లు వస్తూనే ఉంటాయి. వాటి ఆధారంగా కంపెనీలు తయారీ చేపడతాయి. అయితే అన్ని మోడళ్లకు గిరాకీ ఒకేవిధంగా ఉండదు. ఏటా జనవరి నుంచి 'కొత్త ఏడాది మోడల్'గా పరిగణిస్తారు కనుక, డిసెంబరులో పాత నిల్వలు వదిలించుకోడానికి కంపెనీలు, డీలర్‌షిప్‌లు కలిసి ఆఫర్లు ఇస్తుంటాయి.
వచ్చే ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 6 రెండోదశ (బీఎస్ 6.2) కాలుష్య ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తయారైన వాహనాలనే రవాణా శాఖ రిజస్టర్ చేయనుంది. ప్రస్తుతం తయారవుతున్న బీఎస్ 6.1 వాహనాలను మార్చి 31లోపే రిజిస్టర్ చేయాలి. అంటే.. ఇంకా ముందుగానే రిటైల్ విక్రయాలు పూర్తవ్వాల్సి ఉంది. లేదా తుక్కుగా వదిలేయాలి కాబట్టి.. ప్రస్తుత మోడళ్లపై రాయితీ ఇవ్వమని వినియోగదారులూ గట్టిగా అడుగుతున్నారు. అందుకే ఇప్పుడు ఆఫర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఆఫర్లు కంపెనీల కంటే డీలర్ల నుంచే అధికంగా ఉంటాయి. 2020 ఏప్రిల్‌లో బీఎస్ 4 నుంచి బీఎస్ 6 తొలిదశకు మారినప్పుడూ ఇదే పరిస్థితిని పరిశ్రమ ఎదుర్కొంది.