Credit card Tcs 20 :దేశంలో క్రెడిట్ కార్డులు వాడే భారతీయులకు చేదు వార్త. అంతర్జాతీయ లావాదేవీల కోసం వినియోగదారుడు వాడే విదేశీ కార్డులపై జులై 1 నుంచి ఏకంగా 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలతో కూడిన ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. అయితే ఏడాదికి రూ.7 లక్షల వరకు జరిపే ఆర్థిక లావాదేవీలకు ఈ నిబంధన వర్తించదు. కాగా, విద్య, ఆరోగ్యానికి సంబంధించి చేసే అంతర్జాతీయ చెల్లింపుల విషయంలో ఎటువంటి షరతులు వర్తించవు. పూర్తిగా మినహాయింపు ఉంటుంది.
క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్ ఇవే..
Credit card Tcs Rule :వినియోగదారుడు జరిపే అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ లావాదేవీలను (Foreign Transactions) ఇక నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పరిధిలోని లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) కిందకు తీసుకొచ్చింది. ఇంతకుముందు ఈ రకమైన లావాదేవీలు ఎల్ఆర్ఎస్ పథకం పరిధిలోకి వచ్చేవి కాదు. దీంతో వీటిపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. డెబిట్ కార్డులు, ఫారెక్స్ (విదేశీ) కార్డులు, బ్యాంకుల ద్వారా జరిపే ట్రాన్సాక్షన్స్‌కు మాత్రమే LRS కింద 5 శాతం ట్యాక్స్ చెల్లించాలి. ఈ ఏడాది ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో వీటికి సంబంధించి కొన్ని మార్పులను చేసింది ప్రభుత్వం. ఇప్పటివరకు 5 శాతంగా ఉన్న ట్యాక్స్ స్లాబ్ రేట్‌ను జులై 1 నుంచి 20 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం పైన తెలిపిన అన్ని రకాల కార్డులకు వర్తించనుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డులు కూడా ఆ జాబితాలో చేరాయి.