తెలంగాణ

telangana

ETV Bharat / business

డెబిట్, క్రెడిట్ కార్డులకు ఆర్​బీఐ కొత్త రూల్స్​.. పేమెంట్స్ ఇక భద్రం! - న్యూ క్రెడిట్​ కార్డ్​ రూల్స్

new rules for online payment: కార్డుల వినియోగంలో పారదర్శకతతో పాటు వినియోగదారుల హక్కులు పరిరక్షించేలా కొత్త నిబంధనల్ని తీసుకువచ్చింది రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. వీటిని జులై 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

credit card new rules 2022
credit card new rules 2022

By

Published : Jun 19, 2022, 4:31 PM IST

new rules for online payment: ఆన్​లైన్​ లావాదేవీలకు సంబంధించి క్రెడిట్‌, డెబిట్​ కార్డుల విషయంలో ఆర్‌బీఐ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఆన్​లైన్​ పేమెంట్లు చేసే సమయంలో అక్రమాలకు తావు ఇవ్వకుండా టోకనైజేషన్​ వ్యవస్థను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. దీని వల్ల కార్డు డేటాకు మరింత భద్రత ఉంటుందని తెలిపింది. ఈ నిబంధనలను జులై 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ఆర్​బీఐ పేర్కొంది.

ఏంటీ టోకనైజేషన్: చెల్లింపుల వ్యవస్థలో భద్రతను మెరుగుపరచడం కోసం టోకనైజేషన్‌ను తీసుకువచ్చారు. దీని ద్వారా వాస్తవ కార్డు వివరాలకు ప్రత్యామ్నాయంగా ఒక విశిష్ఠ కోడ్‌ ఉంటుంది. దీనిని 'టోకెన్‌' అంటారు. ఈ టోకెన్‌లో ఎలాంటి గోప్యమైన సమాచారం ఉండదు. కేవలం కార్డుకి సంబంధించిన వివరాల గుర్తింపునకు ఇచ్చిన రిఫరెన్స్‌గా మాత్రమే పనిచేస్తుంది. ఇది అనుకోకుండా బహిర్గతమైనప్పటికీ.. ఎలాంటి ప్రమాదం ఉండదు. చెల్లింపుల సమయంలో కార్డు వివరాలకు బదులు టోకెన్ వివరాలను అందజేస్తే సరిపోతుంది. ఆ రిఫరెన్స్‌ ద్వారా కార్డు వివరాలను సరిచూసుకొని లావాదేవీని పూర్తి చేస్తుంది. ఇక్కడ వ్యాపారి వద్ద కార్డుకి సంబంధించిన ఎలాంటి వివరాలూ స్టోర్ కావు గనక మోసాలకు తావుండదు.

టోకనైజేషన్​ లాభాలు:కార్డుకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచడం వల్ల లావాదేవీలు జరిపే సమయంలో అక్రమార్కుల నుంచి రక్షణ లభిస్తుంది. ఇకపై కార్డులకు సంబంధించిన గోప్యమైన సమాచారం టోకెన్‌ల రూపంలో భద్రంగా ఉంటుంది. దీంతో చెల్లింపుల సమయంలో వ్యాపారులకు ఎలాంటి వివరాలను ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల మర్చంట్లు వాస్తవ కార్డు డేటాను నిల్వ చేసుకోవడానికి వీలుండదు. కార్డ్‌-ఆన్‌-ఫైల్‌ అనేది పేమెంట్‌ గేట్‌వే వద్ద నిల్వ అయ్యే కార్డు సమాచారం. తద్వారా భవిష్యత్‌ లావాదేవీలను ప్రాసెస్‌ చేయడానికి మర్చంట్లకు వీలవుతుంది. కార్డు టోకనైజేషన్​ అవసరం లేదు అనుకునే వినియోగదారులు వారి కార్డుకు సంబంధించిన వివరాలన్నీ లావాదేవీల సమయంలో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియంతా ఉచితంగానే చేస్తారు. టోకనైజేషన్​ పూర్తైన తర్వాత వినియోగదారుడు కార్డుకు సంబంధించిన చివరి నాలుగు అంకెలు మాత్రమే చూడగలరు.

టోకనైజేషన్​ కార్డ్స్ పొందడం ఎలా?:టోకెన్​ కార్డ్​ కావాలి అనుకునే వారు బ్యాంకు వెబ్​సైట్​ లేదా యాప్​ ద్వారా దరఖాస్తు చేసుకొని పొందవచ్చు. ఈ టోకెన్​ను వ్యాపారి సంబంధిత క్రెడిట్​/డెబిట్​ కార్డు జారీ చేసే బ్యాంకుకు పంపిస్తారు.

ఇదీ చదవండి:'రుణాలు' భారం కావద్దంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ABOUT THE AUTHOR

...view details