New Car Buying Guide : కొత్త కారు కొనుక్కోవాలని మనలో చాలా మందికి ఉంటుంది. అందుకోసం ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును వెచ్చిస్తూ ఉంటారు. అయితే ఇంత భారీ మొత్తంలో ఖర్చుపెట్టి కారు కొనేటప్పుడు కొన్ని కీలకమైన విషయాలు తెలుసుకోవాలి. భారతదేశంలో కొత్త కారు కొనుగోలు చేసేందుకు ఒక ప్రత్యేకమైన ప్రాసెస్ ఉంటుంది. దీనికి ఎంతో సమయం, శ్రమ, డబ్బు ఖర్చు అవుతుంది. అంతే కాదు కొత్త కారు కొనే ప్రక్రియలో అనేక దశలు కూడా ఉంటాయి. వీటి గురించి చాలా మందికి సరైన అవగాహన కూడా ఉండదు. అలాంటి వారు తప్పక తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే?..
మీకు ఎలాంటి కారు అవసరం?
కొత్త కారు కొనేముందు కచ్చితంగా మీకు ఎలాంటి కారు అవసరముందో చూసుకోవాలి. మీ బడ్జెట్, కుటుంబసభ్యుల సంఖ్య, డ్రైవింగ్ అలవాట్లు మొదలైన అంశాల ఆధారంగా ఎలాంటి కారు తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. అదే విధంగా మీకు హ్యాచ్‌బ్యాక్/ సెడాన్ / ఎస్యూవీ / ఎమ్వీపీకార్లలో ఏది కావాలో నిర్ణయించుకోవాలి.
- హ్యాచ్‌బ్యాక్ కార్లు - వ్యాగన్ఆర్, టియాగో, గ్రాండ్ ఐ10 నియోస్, స్విఫ్ట్, ఆల్ట్రోజ్, ఐ20, బాలినో మొదలైన కార్లు.
- సెడాన్ కార్లు - డిజైర్, ఆరా, అమేజ్, సిటీ, వెర్నా, సియాజ్ మొదలైనవి.
- ఎస్యూవీ - పంచ్, ఎక్స్టర్ (అప్‌కమింగ్), బ్రెజ్జా, నెక్సన్, వెన్యూ, క్రెటా, సెల్టోస్, గ్రాండ్ విటారా, సఫారీ, ఎక్స్‌యూవీ700, ఫార్చ్యూనర్ మొదలైన కార్లు.
- ఎమ్‌పీవీ - ట్రైబర్, ఎర్టిగా, ఎక్స్ఎల్6, కారెన్స్, ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్ మొదలైనవి.
మంచి డీల్ కుదుర్చుకోవాలి!
New Car best deals : మీరు ఏ కారు కొనాలో నిర్ణయించుకున్న తరువాత.. సాధ్యమైనంత వరకు మీకు అందుబాటులో ఉన్న అందరు కారు డీలర్లను సంప్రదించండి. వాళ్లలో మీకు మంచి డీల్ ఇచ్చే వాళ్లను ఎంచుకోండి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతి డీలర్షిప్ వాళ్లు కొన్ని రకాల ఎక్స్ట్రా ఆఫర్లు ఇస్తూ ఉంటారు. మీరు కూడా బెస్ట్ ఆఫర్స్, ఎక్స్ట్రా డిస్కౌంట్ల కోసం అడగండి. ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలు పడకండి.
కారు కొనేముందు ఎక్స్ షోరూం ధర మాత్రమే కాదు. ఆన్ ది రోడ్ ప్రైస్ (ఓటీఆర్) కూడా తెలుసుకోండి. ఓటీఆర్‌లో కారు ధర, రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, ఫాస్ట్‌టాగ్, ఇతర ఛార్జీలు అన్నీ కలిసి ఉంటాయి. డీలర్లు వీటితో పాటు ఎక్స్ట్రా ఉపకరణాల ధరలను కూడా ఓటీఆర్‌లో చేరుస్తారు. ఒక వేళ మీకు ఎక్స్ట్రా ఉపకరణాలు అవసరం లేకపోతే.. కారు కొనే సమయంలోనే వాటిని వద్దని చెప్పవచ్చు.
కారు బుకింగ్ సమయంలో..
Booking the new car : కారును బుక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డీలర్లు కారుతో పాటు ఇస్తామన్న కాంప్లిమెంటరీని కచ్చితంగా బుకింగ్ రిసిప్ట్‌లో నమోదు చేయించాలి. ఒక వేళ బుకింగ్ రిసిప్ట్‌లో ఆ కాంప్లిమెంటరీ ఐటెమ్స్ గురించి రాయకపోతే.. కారు డెలివరీ టైమ్‌లో వాటిని ఇన్స్టాల్ చేయకుండానే.. మీకు కారు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీని వల్ల మీరు చాలా నష్టపోతారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కారు బుకింగ్ రిసిప్ట్‌లో కచ్చితంగా 'బుకింగ్ క్యాన్సిలేషన్ అమౌంట్'ను కూడా నమోదు చేయించాలి. ఒక వేళ మీరు కారు బుకింగ్ రద్దు చేయాలని అనుకుంటే.. అప్పుడు డీలర్ మీకు ఎంత మేరకు రిటన్ ఇస్తాడో దీని ద్వారా ముందుగానే మీకు తెలుస్తుంది.