ప్రపంచవ్యాప్తంగా భారత్ మొత్తం వాణిజ్యం.. రూ.77.15 లక్షల కోట్లు ఇందులో రష్యా, పొరుగుదేశాలతో భారత్ వాణిజ్యమైన రూ.12.64 లక్షల కోట్లు 16.38 శాతానికి సమానం. దీని ప్రకారం చూస్తే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రతిపాదించినట్లు రూపాయల్లో లావాదేవీలను పొరుగు దేశాలు, రష్యా అంగీకరిస్తే, భారత్ ప్రస్తుతం డాలర్లలో చేస్తున్న వాణిజ్యంలో 16.38 శాతాన్ని రూపాయల్లో చెల్లింపులకు మార్చుకోవచ్చు.
ఇదే జరిగితే..: దిగుమతుల కోసం మన దేశం విదేశీ మారకపు ద్రవ్యాన్ని ముఖ్యంగా డాలర్లను ఉపయోగించడం తగ్గుతుంది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించాక, రూ.1 లక్ష కోట్లకు పైగా విలువైన భారత విదేశీ మారకపు నిల్వలు తగ్గాయి. ఫిబ్రవరిలో భారత విదేశీ మారకపు నిల్వలు రూ.47.52 లక్షల కోట్ల మేర ఉండగా, ప్రస్తుతం అవి రూ.46.43 లక్షల కోట్ల స్థాయికి దిగివచ్చాయి. అంతర్జాతీయంగా మాంద్యం నెలకొంటుందనే ఆందోళనల నేపథ్యంలో, దేశ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు పెట్టుబడులు పెద్దఎత్తున ఉపసంహరిస్తున్నారు. ఇందువల్ల డాలర్‌కు గిరాకీ పెరిగి, రూపాయి విలువ రికార్డు కనిష్ఠానికి పడిపోయింది. రూపాయి క్షీణతను నియంత్రించేందుకు, ఆర్‌బీఐ తన దగ్గర ఉన్న విదేశీ మారకపు నిల్వలను కొంతమేర వినియోగిస్తోంది. 'ఇతర దేశాల నుంచి చేసుకునే దిగుమతులతో పాటు, ఎగుమతులకూ కొంతైనా రూపాయల్లో లావాదేవీలు నిర్వహించే' విధానాన్ని ఆర్‌బీఐ సోమవారం ప్రకటించింది. ఇందువల్ల డాలర్‌తో పోలిస్తే 79.59కు పతనమైన రూపాయి విలువ మరింత క్షీణించకుండా చూడొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రష్యాతో వాణిజ్యం మరింత భారీగా
భారత్- రష్యాల మధ్య మొత్తం వాణిజ్యం 2021-22లో రూ.98,000 కోట్లుగా ఉంది. మన దేశం ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్న మొత్తం వాణిజ్యంలో ఇది 1.25 శాతం. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు, మన దేశం దిగుమతి చేసుకునే ముడిచమురులో రష్యా వాటా 0.2 శాతం కాగా, ఈ ఏడాది మార్చి నుంచి భారీగా పెరిగి మే నెలలో 10 శాతానికి చేరడంతో.. ఆమేర వాణిజ్య పరిమాణం మరింత అధికం కావచ్చు.