తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెజాన్​కు షాక్​.. రూ.202 కోట్ల జరిమానా కట్టాల్సిందే..

Amazon Future Deal:ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్​ సంస్థకు గట్టి షాక్​ తగిలింది. కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్​ వేసిన పిటిషన్​ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌ఎటీ) సోమవారం కొట్టివేసింది. 45 రోజుల్లో రూ.202 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

Amazon Future Deal
Amazon Future Deal

By

Published : Jun 13, 2022, 12:25 PM IST

Amazon Future Deal: అమెరికాకు చెందిన ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్​కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఫ్యూచర్ గ్రూపుతో ఒప్పందంపై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్​ దాఖలు చేసిన పిటిషన్​ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌ఏటీ) తిరస్కరించింది.

ఒప్పందం విషయంలో తప్పుడు సమాచారం ఇవ్వడం సహా ఇతర విషయాలను దాచిపెట్టినందుకుగాను అమెజాన్​కు సీసీఐ విధించిన రూ.202 కోట్ల జరిమానా 45 రోజుల లోగా చెల్లించాలని ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్​ ఎం. వేణుగోపాల్​, జస్టిస్​ అశోక్​ కుమార్​ మిశ్రతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. సీసీఐ ఉత్తర్వులను సమర్థించింది.

నేపథ్యమిదీ..
ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ 2020 ఆగస్టులో ఒప్పందం చేసుకుంది. దీని విలువ రూ.24,713 కోట్లు. అయితే, అమెజాన్‌, ఫ్యూచర్‌ కూపన్‌ సంస్థల మధ్య 2019లో జరిగిన ఒప్పందంలోని హక్కులను వినియోగించి ఫ్యూచర్‌-రిలయన్స్‌ ఒప్పందాన్ని అమెజాన్‌ వ్యతిరేకిస్తోంది. అమెజాన్‌-ఫ్యూచర్‌ కూపన్ల ఒప్పందాన్ని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) డిసెంబరు 17న రద్దు చేసింది. తమ అనుమతులు కోరడానికి ముందు అమెజాన్‌ కొంత సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందని తెలిపింది. దీంతో ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తూ అమెజాన్‌పై రూ.202 కోట్ల అపరాధ రుసుమును సైతం సీసీఐ విధించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియ ముందుకు వెళ్లకుండా అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్‌కు ఆదేశాలు జారీ చేయాలని ఫ్యూచర్‌ గ్రూప్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఫ్యూచర్‌ గ్రూప్‌నకు అనుకూలంగా తీర్పు వెలువడింది.

జనవరి 5-8 మధ్య జరగాల్సిన మధ్యవర్తిత్వ ప్రక్రియను సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ నిలిపివేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ జనవరి 5న అమెజాన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక సూచనలుచేసింది. ఇరు పక్షాలూ నేషనల్‌ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్​ను ఆశ్రయించాలని పేర్కొంది. ఈ డీల్‌ చెల్లుబాటు కాదంటూ కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను త్వరగా తేల్చాల్సిందిగా ఎన్​సీఎల్​ఏటీను కోరాలని తన సూచనల్లో పేర్కొంది.

మరోవైపు, ఫ్యూచర్ గ్రూప్​తో చేసుకున్న విలీన ఒప్పందాన్ని రిలయన్స్ రద్దు చేసుకుంది. ఫ్యూచర్‌గ్రూప్‌ రుణదాతలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని గత ఏప్రిల్​లో రిలయన్స్ పేర్కొంది.

ఇవీ చదవండి:రుణ సమీకరణ యత్నాల్లో 'అదానీ'... ఏకంగా రూ.35,000 కోట్ల కోసం..

Insurance Policies: ఆ సందేశాలతో జర భద్రం.. లేకుంటే మీ జేబుకు చిల్లే!

ABOUT THE AUTHOR

...view details