ప్రధానంగా ఈక్విటీ మార్కెట్‌కు సేవలు అందిస్తూ వచ్చిన ఎన్‌ఎస్‌డీఎల్ (నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్) కొత్త ఉత్పత్తులు, సేవలపై దృష్టి సారించింది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా బాండ్లు, 'ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్' వంటి కొత్త ఉత్పత్తులకు తన సేవలను విస్తరించనుంది. దీనికి తగిన సన్నాహాలు చేస్తున్నట్లు ఎన్‌ఎస్‌డీఎల్ ఎండీ, సీఈఓ పద్మజ చుండూరు 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు....
మీరు సుదీర్ఘకాలం పాటు బ్యాంకర్‌గా ఉన్నత స్థానాల్లో కొనసాగారు. ఇప్పుడు స్టాక్‌మార్కెట్లో కార్యకలాపాల్లో కీలకంగా ఉన్న ఎన్‌ఎస్‌డీఎల్‌లో ఎండీ, సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ మార్పు మీకెలా అనిపిస్తోంది.
ఎన్‌ఎస్‌డీఎల్‌లో గొప్ప మానవ వనరులు ఉన్నాయి. వారితో కలిసి పనిచేయటం వల్ల నాకు ఈ పని కొత్తదనే భావన రాలేదు. మన దేశంలో బ్యాంకింగ్ రంగంలో కొన్నేళ్ల క్రితం ఎటువంటి విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయో, అటువంటి వినూత్నమైన మార్పులు ఇప్పుడు స్టాక్‌మార్కెట్లలో కనిపిస్తున్నాయి. జామ్ (జనధన్, ఆధార్, మొబైల్)తో ఈ మార్పులు వస్తున్నాయని చెప్పాలి. దీనివల్ల బ్యాంకింగ్‌లో లావాదేవీలు, చెల్లింపులు అనూహ్యంగా పెరిగినట్లు, స్టాక్‌మార్కెట్లోనూ మదుపరుల సంఖ్య, లావాదేవీల పరిమాణం వేగంగా పెరుగుతోంది. ఎన్నో ఏళ్ల పాటు బ్యాంకింగ్ రంగంలో అన్ని రకాలైన మార్పులను చూసిన నాకు, ఎన్‌ఎస్‌డీఎల్‌లో సెక్యూరిటీల కార్యకలాపాలు పర్యవేక్షించడం ఆసక్తికరంగా ఉంది.
మీరు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్‌ఎస్‌డీఎల్‌లో ఎటువంటి మార్పులు తీసుకువచ్చారు.
మనదేశంలో మొట్టమొదటి డిపాజిటరీ సేవల సంస్థ ఎన్‌ఎస్‌డీఎల్. డీమ్యాట్ అనే పదాన్ని సృష్టించిందే ఈ సంస్థ. గత పాతికేళ్లుగా కేపిటల్ మార్కెట్ల విస్తరణలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తోంది. ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లోకి వచ్చే మదుపరుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తమ కష్టార్జితాన్ని తీసుకువచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. దీనికి తగినట్లుగా ఎన్‌ఎస్‌డీఎల్ స్పందిస్తోంది.'మార్కెట్ కా ఏకలవ్య' అనే పేరుతో హిందీ, కొన్ని ప్రాంతీయ భాషల్లో మదుపరుల్లో అవగాహన పెంపొందిస్తున్నాం. మదుపరులకు 'ద ఫైనాన్షియల్ కెలడోస్కోప్' అనే పేరుతో నెలకోసారి న్యూస్ లెటర్ పంపిస్తున్నాం. ఇదే కాకుండా ఎన్‌ఎస్‌డీఎల్ సమర్థతను ఎన్నో రెట్లు పెంపొందించటం, తద్వారా మదుపరులకు మెరుగైన సేవలు అందించటం లక్ష్యంగా 'ప్రోగ్రామ్- ఏపీటీ' అనే మరొక కార్యక్రమాన్ని తీసుకున్నాం.
కొత్త సేవలు, ఉత్పత్తులు ఆవిష్కరించే ఆలోచన చేస్తున్నారా.
ఎన్‌ఎస్‌డీఎల్ ఇంత వరకూ ఈక్విటీకే పరిమితం కాగా, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా బాండ్లు, ఎలక్ట్రానిక్ గోల్డ్‌రిసీట్స్(ఈజీఆర్) వంటి నూతన ఉత్పత్తులను అందించటానికి సిద్ధపడుతున్నాం. కొలేటరల్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (సీఎంఎస్), డీఎల్‌టీ(బ్లాక్‌చైన్) ప్లాట్‌ఫామ్‌పై డిబెంచర్ సెక్యూరిటీ అండ్ కొవనాంట్ మానిటరింగ్ సిస్టమ్‌ను ఆవిష్కరించబోతున్నాం.
ఎన్‌ఎస్‌డీఎల్ పబ్లిక్ ఇష్యూకు రాబోతోందా.
ఆలోచన ఉంది. దీనిపై పని ప్రారంభించాం. సరైన సమయంలో పబ్లిక్ ఇష్యూకు వస్తాం.