దేశమంతా పర్యటించేందుకు అనుమతి ఉండేలా వాహనాలకు పర్మిట్ జారీకి కొత్త నిబంధనలు తేవాలని కేంద్ర రహదారి, రవాణాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆల్ ఇండియా టూరిస్ట్ వెహికల్ (ఆథరైజేషన్ ఆర్ పర్మిట్)రూల్స్-2021ని రద్దు చేసి ఆల్ ఇండియా టూరిస్ట్ వెహికిల్స్ (పర్మిట్)రూల్స్ - 2022 తీసుకురావాలని నిర్ణయించి, ముసాయిదా విడుదల చేసింది.
తక్కువ ఫీజుతో, 10 సీట్లలోపు వాహనాలకూ ఆలిండియా పర్మిట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. సీట్లకు తగ్గట్టే ఫీజు చెల్లించాల్సి ఉండటం వల్ల ఎక్కువ భారం పడదని పేర్కొంది. దరఖాస్తులను తిరస్కరించే ముందు, అధికారులు ప్రస్తావించిన లోపాలను సరిదిద్దుకోడానికి యజమానులకు ఒక అవకాశం ఇస్తారు. దరఖాస్తు చేసుకున్న వారం లోపు అధికారుల నుంచి స్పందన రాకపోతే, అనుమతి ఇచ్చినట్లుగానే భావించి ఎలక్ట్రానిక్ సిస్టం అందుకు సంబంధించిన అనుమతిని జనరేట్ చేస్తుంది.