National essential drug list 2022 : జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. కొత్త జాబితాలో మొత్తం 384 ఔషధాలున్నాయి. ఇందులో ఐవర్‌మెక్టిన్ లాంటి యాంటీ ఇన్ఫెక్టివ్‌లతో పాటు 34 మందులను కొత్తగా చేర్చారు. ఇక రనిటైడిన్ సహా 26 ఔషధాలను అత్యవసర మందుల జాబితా నుంచి తొలగించారు. ప్రముఖ యాంటాసిడ్ అయిన రనిటైడిన్‌ను తొలగించడంతో ఇకపై జిన్‌టాక్, రాంటాక్ వంటి ట్యాబ్లెట్లు అత్యవసర మందుల జాబితాలో కనిపించవు.
జాతీయ అత్యవసర ఔషధాల జాబితా 2022ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మన్‌సుఖ్ మాండవీయ నేడు విడుదల చేశారు. మొత్తం 27 కేటగిరీల్లో 384 మందులతో కొత్త జాబితా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ జాబితాలోకి చేర్చడం వల్ల పలు యాంటీబయోటిక్‌లు, వ్యాక్సిన్లు, క్యాన్సర్ నిరోధక మందులు వంటి కీలక ఔషధాల ధరలు అందుబాటులోకి రానున్నాయని, రోగులకు మందుల ఖర్చు తగ్గుతుందని మాండవీయ వెల్లడించారు.
ఎండోక్రైన్ మందులు, ఇన్సులిన్ గ్లార్గిన్, ఐవర్‌మెక్టిన్ వంటి 34 రకాల ఔషధాలను కొత్తగా జాబితాలో చేర్చారు. రనిటైడిన్, సక్రాల్‌ఫేట్, అటినోలాల్ వంటి 26 రకాల ఔషధాలను తొలగించారు. మందుల ధరలు, ఉత్తమ ఔషధాల లభ్యత తదితర కారణాలతో ఈ మందులను తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2015 తర్వాత జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను అప్‌డేట్ చేయడం మళ్లీ ఇప్పుడే. 350 మందికి పైగా నిపుణులతో 140 సార్లు చర్చలు జరిపి ఈ జాబితాను తయారుచేసినట్లు కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.
క్యాన్సర్ ఆందోళనల వల్లేనా..
ప్రముఖ యాంటాసిడ్ సాల్ట్ అయిన రనిటైడిన్ ఔషధాన్ని దేశంలో అసిలాక్, జిన్‌టాక్, రాంటాక్ వంటి బ్రాండ్లతో విక్రయిస్తున్నారు. ఎసిడిటీ, కడుపునొప్పి సంబంధిత సమస్యలకు వైద్యులు ఈ మందులను ఎక్కువగా సూచిస్తుంటారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా అమ్ముడయ్యే ఔషధాల్లో ఇది ఒకటి. అయితే ఈ ఔషధంలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని 2019లో అమెరికా పరిశోధన ఒకటి వెల్లడించింది. దీంతో అప్పటి నుంచి ఈ ఔషధ వినియోగంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బహుశా ఈ కారణం చేతే తాజాగా అత్యవసర ఔషధాల జాబితా నుంచి దీన్ని తొలగించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.