Nadia Chauhan Success Story : ఫ్రూటీ, ఆపీ ఫిజ్లకు భారత శీతలపానీయాల మార్కెట్లో ప్రత్యేక స్థానముంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇవి రెండూ దొరుకుతాయి. మంచి రుచి, చిన్న ప్యాకింగ్, తక్కువ ధరకే లభించడం.. ఇలా కారణాలేవైనా ఇవి విశేషాదరణ పొందాయి. ఇంత ఫేమస్ అయిన డ్రింక్స్ విజయం వెనక లేడీ వ్యాపార వేత్త ఉన్నారని మీకు తెలుసా? ఆమె పేరు నదియా చౌహాన్. తన వ్యూహాలు, నైపుణ్యాలు, విజన్‌తో ఇండియన్ మార్కెట్లో వాటికి ప్రత్యేక స్థానం కల్పించారు. ఆమె విజయ ప్రస్థానం గురించిన వివరాలివీ..
నదియా జీవిత విశేషాలు
Nadia Chauhan Biography : నదియా చౌహాన్ అమెరికాలోని కాలిఫోర్నియాలో పుట్టి, ముంబయిలో పెరిగారు. ఈమె ప్రముఖ వ్యాపారవేత్త, పార్లే ఆగ్రో కంపెనీ ఛైర్మన్ ప్రకాష్ చౌహాన్ కుమార్తె. కామర్స్ చదివిన నదియా.. తన కుటుంబ వారసత్వాన్ని కొనసాగించాలని కోరుకున్నారు. చిన్నప్పటి నుంచే సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనేవారు. అనుకున్నట్లుగానే 2003లో అంటే తన 17వ ఏట కంపెనీలో చేరి అధికారిక పదవిని చేపట్టారు. ప్రస్తుతం నదియా కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
పార్లే ఆగ్రో మేనేజింగ్ డైరెక్టర్ నిధి చౌహాన్ విజయ ప్రస్థానం
Nadia Chauhan Business Success Story : నదియా చౌహాన్తాను కంపెనీలో జాయిన్ అయ్యేటప్పటికి తమ ఉత్పత్తుల్లో ఫ్రూటీ మాత్రమే అమ్మకాల్లో 95 శాతం వాటా ఉందనే విషయం గమనించారు. తమ ఉత్పత్తులు వైవిధ్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. లక్ష్య సాధన కోసం సిబ్బంది అందరూ కలిసి పనిచేసే వాతావరణం కల్పించారు. ఇది సత్ఫలితాన్ని ఇచ్చింది. కంపెనీ విలువ రూ.300 కోట్ల నుంచి రూ.8,000 కోట్లకు పెరిగింది. నదియా చౌహాన్ ప్రూటీతో పాటు ఇతర ఉత్పత్తుల అమ్మకాలను బాగా పెంచారు. పార్లే ఆగ్రో మొత్తం ఉత్పత్తులలో ఫ్రూటీ జ్యూస్ ఉత్పత్తిని 48 శాతానికి కుదించారు. దీనితో గతంతో పోలిస్తే.. కంపెనీ టర్నోవర్ విలువ రెట్టింపు అయ్యి రూ.5 వేల కోట్లకు చేరింది.
ఫ్రూటీ బ్రాండ్!
Frooti Brand : నదియా చౌహాన్ ఫ్రూటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఆలియాభట్‌ని నియమించి జోష్ పెంచారు. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.1604 కోట్ల ఆదాయం వచ్చింది. నదియా సారథ్యంలోనే ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్ (బెయిలీ) అమ్మకాలు సైతం భారీగా పెరిగాయి. ఇప్పుడది రూ.1000 కోట్ల వ్యాపారంగా మారింది. ఆమె లీడర్‌షిప్‌లో వచ్చిన డ్రింక్ ఆపీ ఫిజ్ బాగా సక్సెస్ అయింది. ఆపీ ఫిజ్కి ముందు భారత మార్కెట్లో ఆపిల్ జ్యూస్ కేటగిరీ, ప్యాకేజ్డ్ ఫార్మాట్లో అందుబాటులో లేదు. మార్కెట్‌పై నదియాకు ఉన్న మంచి అవగాహన వల్లే తాను కంపెనీలో జాయిన్ అయిన రెండేళ్లకు అనగా 2005లో ఆపీ ఫిజ్‌ను ప్రారంభించేలా చేసింది. ఈ నిర్ణయం కంపెనీ పరంగా గేమ్ చేంజర్‌గా నిరూపితమైంది. ఈ వినూత్నమైన, రిఫ్రెష్ ఆపిల్ డ్రింక్ వినియోగదారులను ఆకట్టుకుని సక్సెస్ సాధించింది. ఆపీ ఫిజ్ విజయంతో పార్లే ఆగ్రో మరింత ఊపందుకుంది. కంపెనీ పరిధిని మరింత విస్తరించి భారత పానీయాల మార్కెట్లో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆపీ ఫిజ్ ప్రారంభమైనప్పటి నుంచి వృద్ధి రేటు 70 శాతానికి పెరిగింది. ఒకటిన్నర దశాబ్దంలో కంపెనీ విలువ రూ.250 కోట్ల నుంచి రూ.5 వేల కోట్లకు చేరింది.
పార్లే ఆగ్రో విజయగాథ
Parle Agro Success Story : మార్కెట్లో ఏ డ్రింక్ కూడా ఇన్నేళ్లు అనుకున్నంతగా మనుగడలో లేదు. అయితే నదియా ఫ్రూటీని ఎలా ఉంచగలిగారు అంటే.. పోటీ ప్రపంచాన్ని తట్టుకోవడానికి నిత్య విద్యార్థిలా మార్కెట్ గురించి రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. 2005లో రిస్క్ తీసుకుని ఫ్రూటీ ఐకానిక్ గ్రీన్ కలర్ ప్యాకింగ్‌ని పసుపు రంగులోకి మార్చారు. దీని వల్ల ఇది చిన్న పిల్లలు మాత్రమే తాగే డ్రింక్ అనే ట్యాగ్ నుంచి విముక్తి పొందింది. అక్కడితో ఆగకుండా 2015లో బ్రాండ్‌ను భిన్నమైన గుర్తింపుతో తిరిగి ప్రారంభించారు. ఈ సారి ప్యాకేజింగ్, ప్రకటనలు, ప్రదర్శనలు, ఉత్పత్తిపై దృష్టి సారించి విజయం సాధించారు.
తండ్రి ప్రకాశ్ చౌహాన్‌తో నిధి చౌహాన్ Parle Agro Products : కంపెనీ సక్సెస్‌లో నదియా సోదరి షౌనా చౌహాన్ పాత్ర కూడా ఉంది. ఆమె నదియా కంటే వయసులో పెద్ద. ఉత్పత్తి తయారీ, నాణ్యత, ఆర్థిక, సాంకేతికత విధులకు నాయకత్వం వహిస్తారు. మరోవైపు నదియా వ్యూహాలు, అమ్మకాలు, మార్కెటింగ్, పరిశోధన, అభివృద్ధిపై దృష్టి సారించడం వల్ల కంపెనీ నూతన శిఖరాలు అధిరోహించింది. ఇండియాలో ఫాస్ట్ మూవింగ్ కన్య్సూమర్ గూడ్స్ పెద్ద కంపెనీల్లో పార్లే ఆగ్రో ఒకటి. ఈ రెండు డ్రింక్స్ అమ్మకాలు నదియా వచ్చాక విపరీతంగా పెరిగాయి. 2030 నాటికి పార్లీ అగ్రోను రూ.20 వేల కోట్ల కంపెనీగా మార్చడమే తమ లక్ష్యమని తెలిపారు.
నదియా చౌహాన్ బలమైన సంకల్పం, వినూత్న ఆలోచన, నిబద్ధతతో తన సంస్థను ఉన్నత స్థానంలో నిలపడమే కాకుండా భారతీయ పానీయాల పరిశ్రమలో మహిళా సాధికారతకు ఒక చిహ్నంగా, ఎంతో మందికి స్ఫూర్తిదాయంగా నిలిచారు.