తెలంగాణ

telangana

ETV Bharat / business

మ్యూచువల్ ఫండ్​ 'సిప్' మిస్ అయ్యారా? నష్టాలేంటో తెలుసుకోండి! - సిప్​ సరిగ్గా చెల్లించకపోతే ఏం జరుగుతుంది

Mutual Fund Sip Investment : మ్యూచువల్ ఫండ్​ సిప్‌లో పెట్టుబడులు పెడుతున్నారా? క్రమం తప్పకుండా సరైన టైంలోనే వాయిదాలు చెల్లిస్తున్నారా? అనుకోని కారణాల వల్ల సిప్‌ మిస్‌ అయ్యారా? ఒకవేళ సిప్​ చెల్లింపులు మిస్​ అయితే ఏ ప్రయోజనాలు కోల్పోతారో తెలుసుకోండి.

mutual-fund-sip-investment-what-happens-if-we-miss-sip-in-mutual-funds
మ్యూచువల్ ఫండ్ సిప్ పెట్టుబడి

By

Published : Jul 16, 2023, 5:55 PM IST

Mutual Fund Sip Missed : ఎక్కువ మొత్తంలో నగదు సమకూర్చుకునేందుకు ఉన్న మార్గాల్లో క్రమానుగత పెట్టుబడి విధానం ఒకటి. క్రమశిక్షణతో మ్యూచువల్ ఫండ్​ సిప్‌లో చేసే పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి లాభాలను తెచ్చిపెడతాయి. కాంపౌండింగ్‌ ప్రతిఫలమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. దీనికోసం ప్రతి నెలా క్రమం తప్పకుండా స్థిర మొత్తంలో డబ్బులు పెట్టాలి. ఏదైనా కారణం వల్ల ఆ నెల సిప్‌ చెల్లించడం మరిచిపోతే మీ ప్రతిఫలంపై ప్రభావం పడుతుంది. కాబట్టి ఒక్క నెల కూడా మిస్​ చేయకుండా సిప్‌ మొత్తాన్ని అకౌంట్‌లో ఉంచటం మంచి పని. కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల సిప్‌ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ఏదైనా కారణం వల్ల మీరు చెల్లించాల్సిన సిప్‌ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ ఖాతాలో జమచేయకపోయినట్లైతే.. మీరు కోరుకున్న సమయంలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కోల్పోతారు. మీరు సిప్‌ మిస్‌ చేసిన సమయంలో మంచి లాభాలు ఇస్తూ మార్కెట్‌ అనుకూలంగా ఉంటే.. ఆ ప్రతిఫలాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
  • మీకు ఆర్థిక భరోసానిచ్చే ఓ మంచి అలవాటుగా సిప్‌ను చెప్పుకోవచ్చు. క్రమం తప్పకుండా ఈ సిప్​లను చెల్లిస్తే ఆశించిన స్థాయిలో ఫలితాన్ని పొందొచ్చు. ఒకవేళ మధ్యలో కొన్ని వాయిదాలను దాటవేస్తే.. వచ్చే రాబడిలో వ్యత్యాసం గణనీయంగా ఉంటుంది. దీంతో మీరు అనుకున్న ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవడంలో అవాంతరం కలుగుతుంది.
  • మీ ఖాతాలో సిప్‌లో చెల్లించాల్సినంత డబ్బు లేని సమయంలో.. మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు మీ అకౌంట్‌ నుంచి సొమ్మును తీసుకోలేవు. అటువంటి సందర్భంలో ఆ నెల సిప్‌ రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది.
  • చెల్లింపులను మిస్ చేసినట్లైతే మీ మ్యూచువల్ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోపై ప్రభావం పడుతుంది. అందులోని యూనిట్ల సంఖ్య తగ్గిపోతుంది. దీని వల్ల మీరు పెట్టుబడి చేసిన మొత్తంపై క్రమంగా ప్రభావం పడుతుంది.
  • ఆలస్యంగా లేదా పూర్తిగా సిప్‌ పేమెంట్లుచెల్లించని సమయంలో కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు పెనాల్టీ విధిస్తాయి. సొమ్మును అదనంగా తీసుకుంటాయి. కాబట్టి మీరు ఏ సంస్థకు చెందిన మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ చేయాలనుకుంటున్నారో.. వాటి నియమనిబంధనలు కచ్చితంగా తెలుసుకోవాలి.
  • సిప్‌లో క్రమంగా పెట్టుబడులు చేయటం క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి విధానంగా చెప్పవచ్చు. ఈ దీర్ఘకాల పెట్టుబడి విధానం ద్వారా మీరు కోరుకున్న ఆర్థిక లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటారు. స్థిరత్వం, క్రమశిక్షణ అనేవి దీర్ఘకాలంలో మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. అందుకనే ఎగవేత లేకుండా క్రమం తప్పకుండా సిప్‌ చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తారు. మీ వద్ద సిప్‌లో పెట్టాల్సిన సొమ్ము లేని సమయంలో.. సంబంధిత మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థను సంప్రదించడం మంచిది. వారు ఇతర పరిష్కార మార్గాలను సూచించే అవకాశం ఉంటుంది.
  • ఇవీ చదవండి:
  • Car Loan Tips : కారు 'లోన్​' తీసుకోవాలా?.. ఈ జాగ్రత్తలు పాటిస్తే ప్రాబ్లమ్​ లేకుండా..​!
  • ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉంటే నష్టమా? ఎన్ని ఉంటే మంచిది?

ABOUT THE AUTHOR

...view details