Mutual Fund Investment Tips :ఈ కాలంలో చాలా మంది భారతీయ మదుపరులు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) గణాంకాల ప్రకారం, మ్యూచువల్ ఫండ్ల నిర్వహణలో ఉన్న సగటు ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.46.71 లక్షల కోట్లు. వాస్తవానికి గత నెలలో మ్యూచువల్ ఫండ్లలోకి దాదాపు రూ.20,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. దీని ద్వారా ఇండియన్ ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియోలో మ్యూచువల్ ఫండ్లకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
దీర్ఘకాలిక వ్యూహంతో..
Mutual Fund Long Term Investment Benefits :మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కానీ దాదాపు 51 శాతం మంది కేవలం ఒక్క ఏడాదిలోపే తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. మరో 29 శాతం మదుపరులు మాత్రమే తమ పెట్టుబడిని రెండేళ్లకు మించి కొనసాగిస్తున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
నష్టభయం ఉంటుంది.. కానీ
కొన్ని మ్యూచువల్ ఫండ్లలో నష్టభయం కాస్త ఎక్కువగానే ఉంటుంది. మరికొన్నింటిలో నష్టభయం కాస్త తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే.. వీటిలో రిస్కు, రాబడి రెండూ తక్కువగానే ఉంటాయి. అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే.. వీటిలో రిస్క్, రివార్డ్ రెండూ ఎక్కువగానే ఉంటాయి. అంటే నష్టభయం ఎక్కువగా ఉన్న చోట, దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయని మనం అర్థం చేసుకోవాలి. అందుకే స్వల్ప నష్టభయం ఉన్న పథకాల్లో కనీసం 6 నెలల నుంచి 3 ఏళ్ల వరకూ పెట్టుబడులను కొనసాగించాలి. అదే నష్టభయం ఎక్కువగా ఉన్న పథకాల్లో కనీసం 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు పెట్టుబడులను కొనసాగించాలి. అప్పుడే మార్కెట్ అస్థిరతలను తట్టుకొని, మంచి లాభాలు పొందేందుకు వీలవుతుంది.
పన్నుల భారం తగ్గాలంటే..
మ్యూచువల్ ఫండ్ పథకాలను స్థూలంగా డెట్, ఈక్విటీలుగా వర్గీకరించవచ్చు. వీటిపై వచ్చే లాభాలపై పన్నులు వేర్వేరుగా ఉంటాయి. వాస్తవానికి నిర్ణీత డెట్ ఫండ్ల నుంచి వచ్చిన లాభాలను.. మీ వ్యక్తిగత ఆదాయంలో భాగంగా కలిపి చూపించి, అందుకు వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లపై వచ్చిన లాభాలను ఒక ఏడాదిలోపు స్వీకరిస్తే.. ఆ మొత్తంపై 15 శాతం వరకు స్వల్పకాలిక మూలధన రాబడి పన్ను చెల్లించాలి. ఏడాదికి మించి పెట్టుబడులు కొనసాగించినప్పుడు.. దానిపై వచ్చిన లాభాలను దీర్ఘకాలిక మూలధన రాబడిగా పరిగణిస్తారు. అప్పుడు ఏడాదికి రూ.1,00,000కు మించి వచ్చిన లాభాలపై 10 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
తొందరపడకూడదు..
మీరు కనీసం 3 ఏళ్లపాటు పెట్టుబడులను కొనసాగించాలని అనుకుంటే.. ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్) లేదా క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే.. ఈఎల్‌ఎస్‌ఎస్‌లకు 3 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అలాగే క్లోజ్డ్ ఎండెడ్ పథకాలకు.. సాధారణంగా 3 ఏళ్లు నుంచి 5 ఏళ్ల వరకు లాకిన్ పీరియడ్ ఉంటుంది. కనుక తొందరపాటుతో పెట్టుబడులను వెనక్కు తీసుకోకుండా ఇవి అడ్డుకుంటాయి.