Musk Tesla share sale: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ టెస్లా షేర్లను విక్రయించారు. ఆగస్టు 5 నుంచి 9 మధ్య 6.88 బిలియన్ డాలర్లు (సుమారు రూ.54,680.52 కోట్లు) విలువ చేసే 79.2లక్షల షేర్లను మస్క్ అమ్మేశారు. ఈ విషయాన్ని అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ కమిషన్(ఎస్ఈసీ) వెల్లడించింది. సంస్థలో తన వాటాను ఇక అమ్మేది లేదని ప్రకటించిన నెలల వ్యవధిలోనే తాజా విక్రయం జరగడం గమనార్హం.
కారణం ట్విట్టర్ డీల్!
టెస్లా షేరు ఈ ఏడాది 30 శాతం మేర పడిపోయింది. మంగళవారం 850 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. అయితే, తనకు టెస్లా షేర్లను విక్రయించే ఆలోచన లేదని ఏప్రిల్ 29న మస్క్ వెల్లడించారు. గడిచిన 10 నెలల్లో 32 బిలియన్ డాలర్లు విలువైన టెస్లా షేర్లను మస్క్ విక్రయించారు. తాజా విక్రయానికి మస్క్ కారణం చెప్పారు. ట్విట్టర్ డీల్ కారణంగానే షేర్లు విక్రయించినట్లు వెల్లడించారు. ట్విట్టర్ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి వస్తే.. అత్యవసరంగా నిధులు సమీకరించాల్సిన పరిస్థితులు తలెత్తకుండా షేర్లు అమ్మేస్తున్నట్లు ట్వీట్ చేశారు.