Musk On Thread : ట్విట్టర్‌కు పోటీగా మెటా సంస్థ థ్రెడ్స్ ప్రారంభించడం వల్ల అప్రమత్తం అయ్యారు అధినేత ఎలాన్ మస్క్. ఈ మేరకు మెటా సీఈఓ జుకర్‌బర్గ్‌కు హెచ్చరికగా ఓ లేఖను పంపారు. ట్విట్టర్ మాజీ ఉద్యోగుల నుంచి వాణిజ్య పరమైన రహస్యాలను దొంగిలించారని.. దీనిపై తాను న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేస్తానని అందులో చెప్పారు. ట్విట్టర్ వాణిజ్య రహస్యాలు, మేథో సంపత్తి హక్కులను ఉద్దేశపూర్వకంగానే దుర్వినియోగం చేశారని మస్క్ తరఫు న్యాయవాది అలెక్స్ స్పిరో లేఖలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మస్క్.. స్నేహపూర్వక పోటీ మంచిదని.. మోసం చేయడం మంచి పద్ధతి కాదన్నారు.
"మెటా ఉద్దేశపూర్వకంగానే ట్విట్టర్ మాజీ ఉద్యోగులను తన సంస్థలో నియమించుకుంది. వారి సహాయంతో అక్రమంగా ట్విట్టర్ పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు సహా ఇతర రహస్యాలను దొంగిలించుకుంది. ట్విట్టర్ మాజీ ఉద్యోగులను థ్రెడ్స్ అభివృద్ధిలో ఉపయోగించుకుంది. ట్విట్టర్ మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించింది. మెటా వెంటనే ఇలాంటి రహస్య సమాచారాన్ని దొంగిలించడం ఆపాలి."
-అలెక్స్ స్పిరో, ఎలాన్ మస్క్ తరఫు న్యాయవాది
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ లేఖపై స్పందించారు మెటా ప్రతినిధి ఆండీ స్టోన్. మస్క్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. థ్రెడ్స్ ఇంజినీరింగ్ బృందంలో ఒక్కరూ కూడా ట్విట్టర్ మాజీ ఉద్యోగి లేరన్నారు. మరోవైపు ఈ వివాదంపై మాట్లాడిన న్యాయ నిపుణులు.. ఈ కేసు ఎంత వరకు వెళుతుందో అంచనా వేయలేమన్నారు. ఈ పిటిషన్ వల్ల ఫలితం ఉండొచ్చు లేదా లేకపోవచ్చని అభిప్రాయపడ్డారు. థ్రెడ్స్‌ను అడ్డుకోవడానికి వేసే వ్యూహం కూడా అయ్యి ఉండొచ్చని చెప్పారు.
Musk Vs Zuckerberg Fight : టెస్లా అధినేత ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత అనేక సంస్థలు పోటీగా వచ్చాయి. మాస్టోడాన్, ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే నేతృత్వంలోని బ్లూస్కై సంస్థలపై ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. కానీ థ్రెడ్స్ ప్రారంభించిన మొదటి రోజే అంచనాలకు మించడం వల్ల అప్రమత్తం అయ్యారు మస్క్. థ్రెడ్స్‌లో తొలిరోజే.. 30 మిలియన్ యూజర్లు లాగిన్ అయ్యారు. ఐఓఎస్ ఆప్ స్టోర్‌లో గురువారం మధ్యాహ్నం నాటికి ఉచిత యాప్‌ల విభాగంలో మొదటి స్థానంలో ఉంది.
Meta Threads Launch : సోషల్ మీడియా దిగ్గజం మెటా కంపెనీ 'థ్రెడ్స్' పేరుతో సరికొత్త మైక్రో బ్లాగింగ్ యాప్‌ను బుధవారం లాంఛ్ చేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, జపాన్‌తో సహా 100 కంటే ఎక్కువ దేశాలలో యాపిల్, గూగుల్, గూగుల్ ఆండ్రాయిడ్ యాప్ అందుబాటులోకి వచ్చింది.
Threads Instagram : థ్రెడ్స్ యాప్‌ను ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్‌తోనే వినియోగించుకోవచ్చు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఫాలో అయ్యేవారినే.. ఇక్కడ కూడా ఫాలో కావచ్చు. థ్రెడ్స్‌లో అక్షరాల లిమిట్ 500గా ఉంచింది మెటా. ట్విట్టర్లో 280 అక్షరాలు కాగా.. థ్రెడ్స్‌లో అంత కంటే ఎక్కువే.