Multi asset funds: ఒకేచోట మదుపు చేయడం ఎప్పుడూ ప్రమాదమే. దీనికి భిన్నంగా రెండుమూడు రకాల పెట్టుబడుల్లో మదుపు చేయడమే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ల ప్రత్యేకత. దీర్ఘకాలిక వ్యూహంతో, విభిన్నమైన పెట్టుబడుల్లో మదుపు చేయాలని భావించే వారికి ఇవి సరిగ్గా సరిపోతాయి. ఒకే తరహా పెట్టుబడి ఫండ్లతో పోలిస్తే.. వీటిల్లో కాస్త నష్టభయమూ తక్కువే.
ఈ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్లు తప్పనిసరిగా తమ పోర్ట్‌ఫోలియోలో 10 శాతాన్ని మూడు విభిన్న ఆస్తులలో మదుపు చేయాల్సి ఉంటుంది. భారత్‌లో చాలా ఫండ్ సంస్థలు దీనికోసం దేశీయ ఈక్విటీ, డెట్, బంగారాన్ని ఎంచుకుంటున్నాయి. కొంతమంది ఫండ్ మేనేజర్లు అంతర్జాతీయ ఈక్విటీల్లోనూ పెట్టుబడులు పెడుతున్నారు. ఒక మోస్తరు నష్టాన్ని భరించే వారు ఇలా పలు రకాల పెట్టుబడుల నుంచి ఒకే పథకం ద్వారా ప్రయోజనం పొందాలని అనుకున్నప్పుడు ఈ తరహా ఫండ్లను పరిశీలించవచ్చు.
మిశ్రమంగా..:ఒకే పథకంలో మదుపు చేయడం ద్వారా మిశ్రమ ఆస్తులలో పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తుంటాయి మల్టీ అసెట్ ఫండ్లు. దీంతో ఆయా విభాగాల్లో వచ్చే లాభాలను అందుకునేందుకు దోహదం చేస్తాయి. ప్రతికూల పరిస్థితుల్లో పెట్టుబడి మొత్తానికి రక్షణను అందిస్తుంది. ఈక్విటీ, డెట్, బంగారంతోపాటు కొందరు ఫండ్ మేనేజర్లు కమోడిటీలు, అంతర్జాతీయ మార్కెట్‌లలో ఉన్న అవకాశాలనూ అన్వేషిస్తుంటారు. స్పష్టమైన, విలక్షణమైన పెట్టుబడులను అందించడమే లక్ష్యంగా ఈ ఫండ్లు పనిచేస్తాయన్నమాట.
సౌలభ్యం:కొత్త తరం మదుపరులు ఎంతోమంది మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. స్టాక్ మార్కెట్‌ను అర్థం చేసుకోవడంతోపాటు, వైవిధ్యానికి ఉన్న ప్రాధాన్యాన్నీ గుర్తిస్తున్నారు. నష్టభయం అధికంగా ఉన్నచోట ఆదాయాన్ని ఆర్జించేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయి. అయితే, పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోను నిరంతరం పర్యవేక్షించడం అంత తేలిక కాదు. మల్టీ అసెట్ ఫండ్లలో వైవిధ్యం అంతర్లీనంగా ఉంటుంది. కాబట్టి, మదుపరులు ఒక్కో తరహా పథకాన్ని ఎంచుకొని, వాటిని నిర్వహించాల్సిన అవసరాన్ని ఇవి తగ్గిస్తాయి.