భారత అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ విదేశాల్లో మరో లగ్జరీ విల్లాను కొనుగోలు చేశారట. అరబ్ నగరం దుబాయిలోని సముద్ర తీరంలో 80 మిలియన్ డాలర్లతో (భారత కరెన్సీలో దాదాపు రూ.640కోట్లు) ఈ విల్లాను కొనుగోలు చేసినట్లు బ్లూమ్‌బర్గ్ కథనం వెల్లడించింది. దుబాయిలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీల్ అని ఈ వ్యవహారంతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులు చెప్పినట్లు ఈ కథనం పేర్కొంది.
దుబాయిలోని పామ్ జుమైరాలో ఉన్న ఈ విల్లాను ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ కోసం ఈ ఏడాది ఆరంభంలోనే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రైవేటు డీల్ కావడంతో దీన్ని అత్యంత రహస్యంగా ఉంచినట్లు బ్లూమ్‌బర్గ్ కథనం పేర్కొంది. దుబాయి స్థానిక కథనాల్లోనూ అంబానీ పేరును వెల్లడించకుండా భారత బిలియనీర్ అని పేర్కొన్నారు. రిలయన్స్ ఆఫ్‌షోర్ సంస్థల్లో ఒకటి ఈ డీల్‌ను రహస్యంగా జరిపినట్లు తెలుస్తోంది. ఈ విల్లాను తమకనుగుణంగా మార్చుకోవడంతో పాటు, భద్రత కోసం అంబానీలు మరిన్ని కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం.
షారుక్ ఖాన్ ఇంటి దగ్గర్లోనే..
చెట్టు ఆకారంలో ఉండే ఈ పామ్ జుమైరా.. దుబాయిలో కృతిమంగా ఏర్పాటుచేసిన దీవుల సముదాయం. ఈ ప్రాంతంలోనే ఓ బీచ్ సైడ్ లగ్జరీ విల్లాను అంబానీ కొనుగోలు చేశారట. ఇందులో 10 పడకగదులు, ప్రైవేట్ స్పా, ఇండోర్, అవుట్‌డోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఈ విల్లాకు సమీపంలోనే బ్రిటిష్ ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్‌హమ్, బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ నివాసాలు కూడా ఉన్నాయి.