Reliance Family Day Function 2022 : దేశవ్యాప్తంగా 5జీ మొబైల్ సేవలను 2023 చివరికల్లా విస్తరించాలని ప్రణాళిక రూపొందించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ.. రిటైల్ వ్యాపార విభాగానికీ లక్ష్యాలు సూచించారు. రిలయన్స్ గ్రూప్‌ను దేశంలోనే అత్యంత పర్యావరణహిత కంపెనీగా తీర్చిదిద్దాలని తన వారసులైన ఈశా, ఆకాశ్, అనంత్ అంబానీలకు నిర్దేశించారు. నాయకత్వం వహించడంలో, బృందస్ఫూర్తితో సాగడంలో ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సిని ఉదాహరణగా తీసుకుని.. ముందుకు నడవాలని ఉద్బోధించారు. ఆర్‌ఐఎల్ వ్యవస్థాపకులు, ముకేశ్ తండ్రి ధీరూభాయ్ అంబానీ జయంతి సందర్భంగా నిర్వహించిన 'రిలయన్స్ ఫ్యామిలీ డే' ఈ లక్ష్య నిర్దేశానికి వేదికగా మారింది. గతేడాది ఇదే రోజున తన ముగ్గురు పిల్లలకు గ్రూప్‌లోని 3 విభాగాలను ముకేశ్ అప్పజెప్పిన సంగతి విదితమే. టెలికాం, డిజిటల్ వ్యాపారాలు ఆకాశ్‌కు; రిటైల్ వ్యాపారం ఈశాకు అందించగా.. కొత్త ఇంధన వ్యాపారాన్ని చిన్న కుమారుడు అనంత్‌కు కేటాయించారు. బుధవారం జరిగిన రిలయన్స్ ఫ్యామిలీ డేలో ఉద్యోగులనుద్దేశించి ముకేశ్ చేసిన ప్రసంగాన్ని గురువారం మీడియాకు సంస్థ విడుదల చేసింది. అందులో ఏమన్నారో ఆయన మాటల్లోనే..
ఏళ్లు గడుస్తున్నాయి, దశాబ్దాలు వెళ్లిపోతాయి.. రిలయన్స్ మాత్రం అంతకంతకూ వృద్ధి చెందుతుంది. మర్రి చెట్టు ఎలాగైతే తన శాఖలను మరింత విస్తరించి, ఎంతగా వేళ్లూనుకుంటుందో.. అదే మాదిరి రిలయన్స్ కూడా భారతీయులందరి జీవితాలను స్పృశిస్తోంది. వారికి సాధికారత అందిస్తోంది. వచ్చే అయిదేళ్లలో రిలయన్స్ తన 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా కంపెనీ చేరుకోవాల్సిన లక్ష్యాలను ఉన్నతాధికారులు, ఉద్యోగులకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను.
గ్రామాలు, పట్టణాల మధ్య విభజన రేఖను తుడిచేయాలి
ఆకాశ్ అధిపతిగా ఉన్న జియో.. ప్రపంచంలోనే అత్యుత్తమ 5జీ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా సిద్ధం చేస్తోంది. ఇంత వేగంగా ప్రపంచంలో ఎక్కడా ఈ సేవలను విస్తరించలేదు. 2023 కల్లా 5జీ దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. జియో ప్లాట్‌ఫామ్స్.. భారత తదుపరి అతిపెద్ద అవకాశానికి సిద్ధంగా ఉండాలి. అత్యుత్తమ డిజిటల్ ఉత్పత్తులు, పరిష్కారాలను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అందించాలి. ప్రతి గ్రామానికి 5జీ సేవలందాలి. సాంకేతికత సేవలు పొందడంలో గ్రామం-పట్టణం అనే తేడా ఉండకూడదు. విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక కార్యలాపాల్లో అత్యంత నాణ్యత తీసుకురావడం ద్వారా, దేశ అభివృద్ధిలో జియో భాగం కావాలి.