సామాన్యులకు మరో షాక్ తగిలింది. దిల్లీలో మరోసారి పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది మదర్ డైరీ. లీటర్ ఫుల్ క్రీమ్ పాలపై రూ.1, టోకెన్ పాలపై రూ.2 పెంచనున్నట్లు తెలిపింది. పెంచిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ ఏడాదిలో పాల ధరలను పెంచడం ఇది నాలుగోసారి. అంతకుముందు మార్చి, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో లీటర్‌కు రూ. 2 చొప్పున పెంచింది. దిల్లీలో అత్యధిక పాల సరఫరదారుల్లో మదర్ డైరీ ఒకటి. ఈ సంస్థ రోజుకు 30 లక్షల లీటర్లకు పైగా పాలు విక్రయిస్తోంది.
ఈ పెంపుతో లీటర్ ఫుల్ క్రీమ్ పాల ధర రూ.64కు చేరగా.. టోకెన్ పాల ధర రూ. 50కు చేరుకుంది. అయితే 500 మిల్లీలీటర్ల ప్యాకెట్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని సంస్థ ప్రతినిధి తెలిపారు. ముడి పాలను రైతుల నుంచి సేకరించే వ్యయం పెరగడం వల్లే ధరలు పెంచామని చెప్పారు. ఈ ఏడాది డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడం మరో కారణమని వివరించారు. దాణా ధరల పెరుగుదల, వాతావరణ సమస్యలతో పాల ఉత్పత్తి తగ్గిందని పేర్కొన్నారు. రైతులకు మంచి ధర చెల్లించి వినియోగదారులకు నాణ్యమైన పాల అందిస్తామన్నారు.