Most profitable shares in last 10 years : ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి, విజయం సాధించడం చాలా కష్టం. ఈ వ్యవహారం వివిధ అంశాలతో ముడిపడి ఉంటుంది. సరైన స్టాక్స్ కనుగొనటం ఇందులో చాలా కీలకం. ఇందులో ఏ చిన్న పొరపాటు చేసినా.. మీరు పెట్టిన సంపద అంతా నష్టపోయే ప్రమాదముంది. అందుకే ఇందులో పెట్టుబడి పెట్టాలంటే చాలా అనుభవం అయినా ఉండాలి. లేదా దీని గురించి పూర్తిగా తెలుసుకుని అయినా ఉండాలి.
అయితే.. 12 కంపెనీల స్టాక్స్ గత పదేళ్లలో భారీ లాభాలు సాధించాయి. 2013 ఏప్రిల్‌లో రూ.1 కంటే తక్కువ ట్రేడ్ అయిన స్టాక్‌ల విలువ ఈ ఏడాది ఏప్రిల్ వరకు 208 రెట్లు పెరిగాయి. అందులో శుక్ర ఫార్మాస్యూటికల్స్ 20,744 శాతం లాభంతో అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీ షేరు 2013లో రూ.0.25 ఉండగా.. 2023 ఏప్రిల్ నాటికి రూ.52.93కు ఎగబాకింది. 2013లో ఈ షేర్లలో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే.. ఆ విలువ విలువ రూ.2 కోట్లకు పెరిగేది. వ్యాపారపరంగా.. శుక్ర ఫార్మాస్యూటికల్స్ గత దశాబ్ద కాలంలో భారీగా వృద్ధి చెందింది. 2012 ఆర్థిక సంవత్సరంలో రూ.6.64 కోట్లుగా ఉన్న దీని స్థూల అమ్మకాలు.. 2022 ఆర్థిక సంవత్సరం వచ్చే నాటికి రూ.20.49 కోట్లకు పెరిగాయి. 2012లో రూ.1.27 కోట్ల నష్టం నుంచి 2022 వరకు రూ.0.75 కోట్ల నికర లాభానికి చేరుకుంది.
82 పైసల నుంచి రూ.61కి..
తర్వాతి స్థానంలో రాజ్ రేయాన్ ఇండస్ట్రీస్ అనే సంస్థ ఉంది. 2013, ఏప్రిల్ 6 నాటికి 82 పైసలుగా ఉన్న షేర్ల విలువ.. 2023, ఏప్రిల్ 6కు వచ్చే సరికి రూ.60.99కు చేరింది. దీని తర్వాత ట్రైడెంట్ అనే సంస్థ 3,225 శాతం, ఈక్విప్ సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీస్ 2,990 శాతం, ఎక్స్ టీ గ్లోబల్ ఇన్ఫోటెక్ 2,923 శాతం, మిడ్ ఇండియా ఇండస్ట్రీస్ 2,375 శాతం లాభాలను ఇచ్చాయి.
గత పదేళ్లలో గణనీయమైన లాభాలు సాధించిన ఇతర కంపెనీల్లో అడ్రాయిట్ ఇన్‌ఫోటెక్, రాధే డెవలపర్స్ (ఇండియా), బాంప్ ఎస్ఎల్ సెక్యూరిటీస్, విస్టా ఫార్మాస్యూటికల్స్, డ్యూకాన్ ఇన్ఫ్రా టెక్నాలజీస్, బీఎల్ఎస్ ఇన్‌ఫోటెక్ ఉన్నాయి. ఈ కంపెనీల షేర్ల విలువ దశాబ్ద కాలంలో దాదాపు 1000 నుంచి 2,268 శాతం వరకు పెరిగాయి. ఇదే సమయంలో.. ఈక్విటీ ఇండెక్స్ బీఎస్ఈ సెన్సెక్స్ 225 శాతం పురోగమించగా... బీఎస్ఈ మిడ్ క్యాప్, బీఎస్ఈ స్మాల్ క్యాప్ వరుసగా 297, 369 శాతం మాత్రమే లాభపడ్డాయి.
కొనేముందు జాగ్రత్త..
అయితే, చిన్న షేర్లలో పెట్టుపడి పెట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పెన్నీ స్టాక్‌లపై గుడ్డిగా పెట్టుబడి పెట్టొద్దని హెచ్చరిస్తున్నారు. సంస్థ ప్రమోటర్లు, బిజినెస్ మోడల్‌ను గమనించాలని చెబుతున్నారు. పోటీ కంపెనీలతో పోలిస్తే ఈ సంస్థ మెరుగ్గా ఉందా అన్న విషయాన్ని పరిశీలించాలని సిఫార్సు చేస్తున్నారు.