తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇలా నడిపితే - మీ కారు షెడ్డుకి పోవడం గ్యారెంటీ!

Most Common Mistakes in Car Driving : కొన్ని కార్లు.. కొనుగోలు చేసి సంవత్సరాలు గడుస్తున్నా.. సూపర్ కండీషన్లో ఉంటాయి. మరికొన్ని కార్లు మాత్రం కొన్ని నెలల్లోనే "షెడ్డుకు దారేదీ?" అని వెతుక్కుంటూ వెళ్తాయి. యజమానికి భారీ బిల్లు గిఫ్ట్​గా ఇస్తాయి. దీనికి మెజారిటీ కారణం డ్రైవింగ్ లోపమే అంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందేనంటున్నారు నిపుణులు!

Most Common Mistakes in Car Driving
Most Common Mistakes in Car Driving

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2023, 4:00 PM IST

Most Common Mistakes in Car Driving :చాలా కార్లు త్వరగా దెబ్బతినిపోతుంటాయి. కారణం ఏంటన్నది ఓనర్లకు అర్థంకాదు. అయితే.. సరిగా నడపకపోవడం వల్లే ఈ పరిస్థితి వస్తుందని నిపుణులు అంటున్నారు! మరి.. డ్రైవింగ్​లో చేసే ఆ పొరపాట్లు ఏంటి? వాటిని ఎలా సరిదిద్దుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

గేర్‌బాక్స్‌ :కారు నడుపుతున్నప్పుడు చాలా మంది అవసరం లేకున్నా క్లచ్​ మీద కాలు పెడుతుంటారు. గేర్ రాడ్​పై చెయ్యి వేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పైకి ఎలాంటి మార్పూ కనిపించదు. కానీ.. లోపల ట్రాన్స్‌మిషన్‌పై అనవసరమైన ఒత్తిడి పెరిగిపోతుంది. ఫలితంగా.. గేర్‌షిఫ్ట్‌లపై ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితి కంటిన్యూగా ఉన్నప్పుడు.. క్రమంగా గేర్‌బాక్స్‌ లోని భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. క్లచ్‌ పెడల్‌పై అనవసరంగా ఒత్తిడి పడేవిధంగా కాలు పెట్టకూడదు. అవసరమైనప్పుడే వీటిని ఉపయోగించాలి.

ఇంజిన్‌ :కారుకు ఇంజిన్ గుండె వంటిదని తెలిసిందే. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని రోజుల తర్వాత మీరు కారును బయటికి తీస్తున్నట్టయితే.. కారు స్టార్ట్‌ చేసే సమయంలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంజిన్ ఆన్ చేసి.. ఆయిల్‌ లోపల మొత్తం వ్యాపించేలా చూసుకోవాలి. ఇందుకోసం కాసేపు ఇంజిన్​ ఆన్​లోనే ఉంచాలి. ఆ తర్వాతే బండిని ముందుకు పోనివ్వాలి. ఇలా చేయడం ద్వారా కారులోపల సెన్సార్లతోపాటు ఇతర పార్ట్​లకూ నష్టం కలగకుండా ఉంటుంది.

కారు ఇన్సూరెన్స్‌ రెన్యూవల్‌ - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!

ఇంధనం :కారు మైలేజ్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కారులో లాంగ్‌ జర్నీ చేసేందుకు సిద్ధమైతే.. ముందుగా ఫుల్‌ ట్యాంక్‌ చేయించాలి. ఇది అత్యంత కీలకమైన విషయం. ఎందుకంటే.. ట్యాంక్‌లో పెట్రోల్ లేదా డీజిల్ తక్కువగా ఉన్నప్పుడు ఇంజిన్లో ఉత్పత్తయ్యే వేడిద్వారా ఆవిరి ఏర్పడుతుంది. అది నీరుగా మారి ఇంధనంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే.. ఫ్యూయెల్‌ ఇంజక్షన్‌ సిస్టమ్‌ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

బ్రేక్స్ :కారు నడిపేటప్పుడు బ్రేక్స్ వేయడంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణంలో ఉన్న వాహనాన్ని ఆపడానికి చాలా మంది సడన్​గా బ్రేక్​ వేస్తుంటారు. అవసరం ఉన్నా లేకున్నా.. ఒకేవిధంగా బ్రేక్స్ వేసి బండిని ఆపుతుంటారు. ఇలా చేయడం వల్ల బ్రేక్‌ ప్యాడ్స్ లైఫ్​ టైమ్ తగ్గిపోతుంది. అంతేకాదు.. బ్రేక్స్ వేడెక్కి యాక్సిడెంట్లు జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది.

హ్యాండ్ బ్రేక్ :కారులో హ్యాండ్ బ్రేక్ ఎంత ముఖ్యమో తెలిసిందే. కానీ.. దాన్ని ఎప్పుడు వాడాలనేది చాలా మందికి తెలియదు. ప్రధానంగా.. కారు ప్రయాణంలో ఉన్నప్పుడు హ్యాండ్‌బ్రేక్‌ అస్సలే ఉపయోగించకూడదు. దీని ద్వారా యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి.. బ్రేక్స్ ద్వారా కారును పూర్తిగా ఆపిన తర్వాతనే.. హ్యాండ్‌ బ్రేక్‌ వేయాలి.

సెకండ్​ హ్యాండ్​ కారు కొనాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

కార్‌ వాష్‌ :చాలా మంది కొత్త కారు కొనుగోలు చేసిన తర్వాత.. సంస్థ ఇచ్చే ఫ్రీ సర్వీస్‌ ముగిసే దాకా టంచన్​గా తీసుకెళ్తారు. ఆ తర్వాత నుంచి మాత్రం బద్ధకిస్తారు. కొందరు సమయానికి తీసుకెళ్లకుండా వాయిదాలు వేస్తుంటారు. మరికొందరు అస్సలే సర్వీసింగ్​కు తీసుకెళ్లరు. మనమే ఇంటి వద్ద క్లీన్ చేసుకుంటున్నాం కదా.. సరిపోతుందిలే అనుకుంటారు. కానీ.. అప్పుడప్పుడూ ప్రొఫెషనల్‌ ద్వారా సర్వీసింగ్ చేయించడం కంపల్సరీ అంటున్నారు నిపుణులు.

రూల్స్ పాటించాలి :కారు కొనుగోలు చేసినప్పుడు.. మెయింటెన్స్​కు సంబంధించిన రూల్ బుక్​ను కంపెనీ ఇస్తుంది. అందులో చేసిన సూచనలు తప్పక పాటించాలి. ప్రతి 5 వేల కిలోమీటర్లకు ఒకసారి ఆయిల్‌ ఛేంజ్ చేయాలి. కూలెంట్‌, బ్రేక్‌ ఫ్లూయిడ్‌ వంటివి చెక్ చేసుకోవాలి. కారుతో స్టంట్స్ వేయడం, ఒక్క చేత్తో స్టీరింగ్ పట్టుకోవడం, సరిగా క్లచ్ వేయకుండా గేర్ మార్చడం వంటివి చేయకూడదు. ఇలాంటి పనులు చేయడం ద్వారా.. చేజేతులా కారును దెబ్బ తీస్తుంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక నుంచైనా పద్ధతిగా నడిపితే.. కారు లైఫ్ టైమ్ చాలా పెరుగుతుందని సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details