Moonlighting Infosys : ఒకే సమయంలో ఒకటికి మించి ఉద్యోగాలు చేసే విధానాన్ని అనుమతించేది లేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. ఈ మేరకు తమ ఉద్యోగులకు కంపెనీ యాజమాన్యం లేఖ రాసింది. కంపెనీ నిబంధనలకు ఇది విరుద్ధమని తేల్చి చెప్పంది. ఈ విషయాన్ని ఉద్యోగులకు ఆఫర్ లెటర్‌లోనే స్పష్టంగా పేర్కొన్నట్లు గుర్తు చేసింది. దీన్ని ఉల్లంఘించినవారిని తొలగించడానికి కూడా వెనకాడబోమని తెలిపింది.
ఒకవేళ అలా అదనపు ఆదాయం కోసం ఏదైనా పనిచేయాలనుకుంటే దానికి కంపెనీ అనుమతి తప్పనిసరని లేఖలో పేర్కొంది. సందర్భాన్ని బట్టి నిబంధనలకు లోబడి ఉద్యోగి అభ్యర్థన అర్హమైనదేనని భావిస్తే ప్రత్యేక అనుమతి విషయాన్ని పరిశీలించే అవకాశం ఉందని తెలిపింది. అలాగే దాన్ని ఏ సందర్భంలోనైనా రద్దు చేసే అధికారమూ ఉంటుందని గుర్తు చేసింది.
మూన్‌లైటింగ్‌పై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉద్యోగుల వలసలు అధికంగా ఉన్న ఐటీ పరిశ్రమలో దీనికి ప్రాముఖ్యం పెరిగింది. నైపుణ్యం గల ఉద్యోగులకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో కొంతమంది అదనపు ఆదాయం కోసం ఖాళీ సమయంలో మరో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు పలు సర్వేలు పేర్కొన్నాయి. విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ కూడా ఇటీవల సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల మూన్‌లైటింగ్‌పై ప్రతికూలంగా స్పందించారు.