తెలంగాణ

telangana

ETV Bharat / business

ఖర్చులు తగ్గించుకోవాలా? '30 డేస్ రూల్​' ట్రై చేయండి!

Money saving tips for families : నెల‌కు రూ.50 వేల నుంచి రూ.70 వేలు సంపాదించే వారికి అదనంగా రూ. 1000 - రూ.1500 ఖ‌ర్చు చేయ‌డం పెద్ద‌గా అనిపించ‌దు. కానీ, ఇలాంటి చిన్న చిన్న కొనుగోళ్లు మీకు తెలియ‌కుండానే ఖర్చుల‌ను పెంచేస్తాయి. అటువంటి కొనుగోళ్లను నివారించేందుకు ఒక చ‌క్క‌టి పరిష్కారం 30-రోజుల నియమం.

money saving tips for young adults
ఖర్చులు తగ్గించుకోవాలా? '30 డేస్ రూల్​' ట్రై చేయండి!

By

Published : Aug 11, 2022, 1:48 PM IST

Money saving tips 2022 : డ‌బ్బు ఆదా చేయాలంటే.. ఆదాయం, ఖ‌ర్చుల మ‌ధ్య స‌మ‌తుల్య‌త ఉండాలి. బ‌డ్జెట్ రూపొందించి ఖ‌ర్చుల‌ను ప్లాన్ చేసుకోవాలి. చాలా మంది ఈ విధానాన్ని అనుస‌రిస్తూనే ఉంటారు. ప్ర‌తి నెలా ఇంటి అవ‌స‌రాలు, పిల్ల‌ల ట్యూష‌న్ ఫీజులు, ఇత‌ర ఖ‌ర్చుల‌ను అంచ‌నావేసి బ‌డ్జెట్ రూపొందించి ఖ‌ర్చు చేస్తుంటారు. కానీ నెల చివ‌రకు అనుకున్నంత మొత్తం ఆదా చేయ‌డంలో విఫ‌ల‌మ‌వుతారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం చిన్న పాటి ఖ‌ర్చుల‌ను లెక్క‌లోకి తీసుకోక‌పోవ‌డం. అలాగే, ఆఫ‌ర్ల విష‌యంలో తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం. ఇవే చివ‌రికి పెద్ద మొత్తంగా మారి పొదుపు మొత్తాన్ని త‌గ్గించేస్తాయి.

ఉదాహ‌ర‌ణ‌కు.. మీరు త‌రుచుగా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేవారా? షాపింగ్ వెబ్‌సైట్లు, త‌ర‌చుగా అందుబాటులో ఉన్న ఆఫ‌ర్ల గురించి క‌స్ట‌మ‌ర్ల మొబైల్‌కి మేసేజ్‌ల‌ను పంపుతుంటాయి. ఇలాంటి మేసేజ్‌ల‌ను చూసిన‌ప్పుడు ఆఫ‌ర్లు బాగున్నాయ‌నే ఉద్దేశంతో అవ‌స‌రం లేక‌పోయినా వ‌స్తువుల‌ను కొనుగోలు చేసేస్తుంటాం. ఇప్ప‌టికే రెండు జ‌త‌ల బూట్లు ఉన్న‌ప్ప‌టికీ ఆఫ‌ర్లో త‌క్కువ‌కు వ‌స్తున్నాయ‌ని మ‌రొక జ‌త కొనుగోలు చేయ‌డం వంటివి చేస్తుంటాం. నెల‌కు రూ.50 వేల నుంచి రూ.70 వేలు సంపాదించే వారికి రూ. 1000 - రూ.1500 ఖ‌ర్చు చేయ‌డం పెద్ద‌గా అనిపించ‌దు. కానీ, ఇలాంటి చిన్న చిన్న కొనుగోళ్లు మీకు తెలియ‌కుండానే ఖర్చుల‌ను పెంచేస్తాయి. అటువంటి కొనుగోళ్లను నివారించేందుకు ఒక చ‌క్క‌టి పరిష్కారం 30-రోజుల నియమం. ఇది ఆలోచించకుండా ఖర్చు చేసే అలవాటును అధిగమించడంలో మీకు సహాయపడటమే కాకుండా, మీ ఆర్థిక విషయాలకు సంబంధించి బడ్జెట్, క్రమశిక్షణ, మెరుగైన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడంలో కూడా సహాయపడుతుంది.

30 రోజుల నియ‌మం ఎలా ప‌నిచేస్తుంది?
30 days rule to save money : మీరు ఏదైనా వ‌స్తువును కొనుగోలు చేయాల‌నుకున్న‌ప్పుడు అది మీకు అవ‌స‌ర‌మా లేదా తెలుసుకునేందుకు.. కొనుగోళ్ల‌ను క‌నీసం 30 రోజులు వాయిదా వేయండి. 30 రోజుల త‌ర్వాత కూడా మీకు ఆ వ‌స్తువు అవస‌రం ఉండి.. కొనుగోలు చేయాల‌నుకుంటే చేయొచ్చు. ఒక‌వేళ 30 రోజుల త‌ర్వాత ఆ వ‌స్తువు కొనుగోలు గురించి మీరు మ‌ర్చిపోయినా లేదా ఆ వ‌స్తువు అవ‌స‌రం లేదు అనిపించినా కొనుగోలును వాయిదా వేయ‌డం వ‌ల్ల ఆ డ‌బ్బును ఆదా చేస్తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ వస్తువును అన‌వ‌స‌రంగా కొనుగోలు చేశామ‌ని త‌ర్వాత చింతించ‌కుండా ఉంటారు. అంతేకాకుండా కొనుగోళ్ల విష‌యంలో అవ‌గాహ‌న‌తో కూడిన నిర్ణ‌యం తీసుకోగులుగుతారు.

డ‌బ్బు ఖ‌ర్చుకాకుండా:వ‌స్తువును కొనుగోలు చేయ‌డం ఇప్పుడు వాయిదా వ‌స్తే.. ఈ మొత్తాన్ని వేరే ఖ‌ర్చుల‌కు మ‌ళ్లిస్తార‌నే ఉద్దేశంతోనో, ఆఫర్లు మ‌ళ్లీ రావ‌నే ఆలోచ‌న‌తోనో కొనుగోళ్ల‌ను వాయిదా వేసేందుకు చాలామంది ఇష్ట‌ప‌డ‌రు. అటువంటప్పుడు కొనుగోలు చేయాల‌నుకున్న వస్తువు విలువ‌కు సంబంధించిన మొత్తాన్ని ఒక క‌వ‌ర్‌లో ఉంచి పక్కన పెట్టండి. లేదా తరచూ వాడే బ్యాంకు ఖాతాలో కాకుండా వేరొక బ్యాంకు ఖాతాకు బ‌దిలీ చేయండి. లేదా 30 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఉంచండి. 30 రోజులు గడిచిన తర్వాత వ‌స్తువు అవ‌స‌రం అనుకుంటే.. వ‌స్తువును కొనుగోలు చేయ‌వ‌చ్చు. లేదంటే ఆ మొత్తాన్ని పెట్టుబ‌డుల‌కు కేటాయించ‌వ‌చ్చు. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌ను నియంత్రించ‌డం మాత్ర‌మే కాకుండా పెట్టుబ‌డుల‌ను పెంచి లక్ష్యాన్ని త్వ‌ర‌గా చేరుకోవ‌చ్చు. ప్రారంభంలో ఈ విధానం క‌ష్టంగా అనిపించినా.. పోనుపోనూ మంచి ఫ‌లితాల‌ను అందిస్తుంది.

చివ‌రగా:చాలా మంది ఆఫర్లో త‌క్కువకు వ‌స్తుంద‌ని, ఆఫ‌ర్లు ముగిసిపోతే ఎక్కువ డ‌బ్బు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తుంద‌ని కొనుగోలు నిర్ణ‌యం క్ష‌ణాల్లో తీసుకుంటుంటారు. సంస్థ‌లు త‌మ వ్యాపార వృద్ధి కోసం ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఆఫ‌ర్ల‌తో వ‌స్తూనే ఉంటాయి. కానీ అవ‌స‌రం లేని వ‌స్తువును కొనుగోలు చేయ‌డం వ‌ల్ల డ‌బ్బు వృథా అవుతుంద‌ని మ‌ర్చిపోవ‌ద్దు.

ABOUT THE AUTHOR

...view details