Modified Old Bikes Relaunch In India : ప్రపంచంలోనే టూవీలర్ మార్కెట్ ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. దీంతో టూవీలర్ తయారీ సంస్థల మధ్య తీవ్ర పోటీ ఉంటోంది. అమ్మకాలు పెంచుకునేందుకు వివిధ బైక్ కంపెనీలు.. పలు రకాల వ్యూహాలు రచిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే మరో సరికొత్త ప్లాన్‌తో ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయి. అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందిన బైక్‌లకు స్వల్ప మార్పులు చేసి తిరిగి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ వ్యూహంతో వినియోగదారులను తమవైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ జాబితాలో ప్రధానంగా యమహా ఆర్ఎక్స్ 100, హీరో కరిజ్మా, టీవీఎస్ ఫియరో 125, కవాసకి ఎలిమినేటర్, యమహా ఆర్డీ 350 వంటి బైక్స్ ఉన్నాయి.
యమహా ఆర్ఎక్స్ 100..
ఆర్ఎక్స్ 100 బైక్‌ను తిరిగి మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు యమహా కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు. యమహా ఆర్ఎక్స్ 100ను కొత్తగా రూపొందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు దాదాపుగా సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల సమయం పట్టే అవకాశముందని తెలిపింది.
హీరో కరిజ్మా..
కొన్నేళ్ల క్రితం హీరో కరిజ్మా బైక్‌ను వాడాలని ప్రతి కాలేజ్ విద్యార్థి ఓ కలగా ఉండేది. కానీ వివిధ కంపెనీల నుంచి విపరీతమైన పోటీ కారణంగా.. ఈ బైక్ ఎక్కువ కాలం పాటు మార్కెట్లో నిలవలేకపోయింది. అయితే వినియోగదారులను తిరిగి ఆకట్టుకునేందుకు.. కరిజ్మా బైక్ తిరిగి విడుదల చేసేందుకు ఆ కంపెనీ సిద్ధమైంది. వచ్చే కొన్ని వారాల్లోనే మార్కెట్లోకి ఈ బైక్‌ను కంపెనీ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది.