Modi On Fintech Industry : డిజిటల్ ఆర్థిక లావాదేవీలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా ఆర్థిక సాంకేతిక (ఫిన్‌టెక్) రంగం నిరంతరాయంగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్బోధించారు. వినూత్న ఆవిష్కరణలకు ప్రభుత్వ ప్రోత్సాహం తోడైతే అద్భుతాలకు ఉదాహరణగా ఈ రంగం నిలుస్తుందని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్‌ఎఫ్) సందర్భంగా మోదీ పేర్కొన్నారు.
ప్రధాని సందేశాన్ని జీఎఫ్‌ఎఫ్ 2022 అడ్వయిజరీ బోర్డ్ ఛైర్మన్ క్రిష్ గోపాలకృష్ణన్ చదివి వినిపించారు. 'జన్ ధన్- ఆధార్- మొబైల్ (జేఏఎం), యూపీఐ విజయవంతం ద్వారా మన జీవితంలో డిజిటల్ చెల్లింపులు భాగమయ్యాయి. ఫిన్‌టెక్, అంకురాల విభాగంలో ఆవిష్కరణలకు, పెట్టుబడులకు అంతర్జాతీయ ప్రధాన కేంద్రంగా భారత్ అవతరించేందుకు ఇది దోహదం చేస్తుంద'ని మోదీ తెలిపారు. నాణ్యమైన ఆర్థిక సేవల ద్వారా నిరుపేదలను కూడా ఆర్థిక సాధికారత దిశగా నడిపించేందుకు కృషి చేయాలని సూచించారు.
2022-23లో భారత వృద్ధి 7%:ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పాటు దశాబ్దం పాటు భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ వెల్లడించారు. జనవరి అంచనా 8 శాతం కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. కొవిడ్-19 పరిణామాల ప్రభావం ఇంకా ప్రపంచంపై కొనసాగుతోందని, దీనికి తోడు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం లాంటివి వృద్ధికి అవరోధంగా నిలుస్తున్నాయని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ సమావేశంలో మాట్లాడుతూ ఆయన అన్నారు. సామాన్యుల బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి వారికి రుణాలు, బీమా లాంటి సేవలు అందించడంపై ఈ దశాబ్దకాలంలో ప్రభుత్వం దృష్టి సారించనుందని చెప్పారు.