దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల ఓ చాట్‌బాట్‌తో 'గొడవ'కు దిగారు. అనంతరం దాంతో సారీ కూడా చెప్పించారు. ఇదంతా బిర్యానీ కోసం జరిగింది. బెంగళూరులో జరిగిన ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సమావేశంలో మాట్లాడిన నాదెళ్ల.. చాట్‌జీపీటీ(ChatGPT) అనే చాట్‌బాట్‌తో తనకు జరిగిన సంభాషణ గురించి చెప్పారు. అనంతరం భారత్‌లో జరుగుతున్న అత్యాధునిక కృత్రిమ మేధ(AI), క్లౌడ్ కంప్యూటింగ్(Cloud Computing) ఆవిష్కరణలపై ప్రెజంటేషన్ ఇచ్చారు.
బిర్యానీ కోసం గొడవ..
ప్రెజంటేషన్ ఇవ్వడానికి మందు.. ఆయన సమావేశానికి వచ్చిన వారితో మాట్లాడారు. అనంతరం, చాట్‌జీపీటీ చాట్‌బాట్‌తో తనకు జరిగిన సంభాషణ విశేషాల్ని వారికి చెప్పారు. దాని ప్రకారం.. సౌత్ ఇండియాలో పాపులర్ టిఫిన్స్ లిస్ట్ చెప్పమని చాట్‌జీపీటీ చాట్‌బాట్‌ను ఓ సారి సత్య నాదెళ్ల అడిగారు. ఆ బాట్ ఒక లిస్ట్ ఇచ్చింది. అందులో ఇడ్లీ, దోశ, వడతో పాటు బిర్యానీని కూడా కలిపింది. దీంతో సత్య నాదెళ్ల కోపోద్రిక్తుడై.. బిర్యానీని సౌత్ ఇండియా టిఫిన్స్ లిస్ట్‌లో చేర్చి, అచ్చమైన హైదరాబాదీ మేధస్సును అవమానించొద్దని చెప్పారు. దీంతో ఆ చాట్‌బాట్ నాదెళ్లకు సారీ చెప్పింది. అనంతరం ఆ టిఫిన్స్ మధ్య ఎవరు గొప్పవారో తెల్చేలా ఓ నాటకం రాయమని చాట్‌బాట్‌కు సవాలు విసిరారు నాదెళ్ల. ఆ తర్వాత ఆ టిఫిన్స్ ఒకదానితో ఒకటి మాట్లాడుతున్నట్టు సంభాషణలు స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యాయి. ఆ సంభాషణ ఫొటోలను కూడా నాదెళ్ల ప్రదర్శించారు.