తెలంగాణ

telangana

ETV Bharat / business

'క్లౌడ్'​తోనే పెను మార్పు.. 2025 కల్లా యాప్​లు సిద్ధం: సత్య నాదెళ్ల

దేశంలో సాంకేతికత ఆధారిత ఆర్థిక వృద్ధికి క్లౌడ్‌, కృత్రిమ మేధ(ఏఐ) మద్దతుగా నిలుస్తాయని ఆయన అన్నారు. భారత పర్యటనలో ఉన్న నాదెళ్ల.. "మైక్రోసాఫ్ట్‌ ఫ్యూచర్‌ రెడీ లీడర్‌షిప్‌ సమ్మిట్‌"ను ఉద్దేశించి మాట్లాడారు. 2025 కల్లా క్లౌడ్‌ సంబంధిత మౌలిక వసతులతోనే చాలా వరకు అప్లికేషన్లు సిద్ధమవుతాయని ఆయన అన్నారు.

microsoft-future-leaders-summit-2023-in-mumbai
మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ లీడర్స్ సమ్మిట్ 2023

By

Published : Jan 4, 2023, 8:23 AM IST

Updated : Jan 4, 2023, 8:44 AM IST

భారత్‌లో డిజిటైజేషన్‌ కార్యకలాపాలు అద్భుతంగా జరుగుతున్నాయని మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌, సీఈఓ సత్య నాదెళ్ల కితాబునిచ్చారు. దేశంలో సాంకేతికత ఆధారిత ఆర్థిక వృద్ధికి క్లౌడ్‌, కృత్రిమ మేధ(ఏఐ) మద్దతుగా నిలుస్తాయని ఆయన అన్నారు. 2025 కల్లా క్లౌడ్‌ సంబంధిత మౌలిక వసతులతోనే చాలా వరకు అప్లికేషన్లు సిద్ధమవుతాయని అన్నారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న నాదెళ్ల మంగళవారం ముంబయిలో జరిగిన "మైక్రోసాఫ్ట్‌ ఫ్యూచర్‌ రెడీ లీడర్‌షిప్‌ సమ్మిట్‌"ను ఉద్దేశించి మాట్లాడారు. త్వరలో హైదరాబాద్‌లోనూ పర్యటించనున్న ఆయన ఏమన్నారంటే..

ప్రతి చోటా క్లౌడ్‌ అందుబాటులోకి..
భారత్‌లోని కంపెనీలూ క్లౌడ్‌ సాంకేతికతను అధికంగా వినియోగించుకుంటున్నాయి. టెక్నాలజీ రంగంలో పెను మార్పును క్లౌడ్‌ తీసుకొస్తుంది. క్లౌడ్‌ వల్ల 70-80 శాతం మేర ఇంధన భారం తగ్గుతుంది. అవసరమైనపుడే దీనిని వినియోగించుకోగలగడం ఇందుకు కారణం. 60కి పైగా ప్రాంతాల్లో 200కు పైగా డేటా కేంద్రాలను ప్రపంచవ్యాప్తంగా కలిగి ఉన్నాం. మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ సర్వీస్‌ అయిన అజూర్‌ దేశంలో పుణె, చెన్నై, ముంబయి కేంద్రాలుగా అమలవుతోంది. హైదరాబాద్‌లో నాలుగో రీజియన్‌ను జత చేస్తున్నాం. ప్రతి చోటా నాణ్యమైన క్లౌడ్‌ మౌలిక వసతులను సిద్ధం చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం. ప్రతి ఫ్యాక్టరీ, రిటైల్‌ స్టోర్‌, గిడ్డంగి, ఆసుపత్రి.. ఇలా అన్ని చోట్లా అందుబాటులోకి తెస్తాం.

కృత్రిమ మేధపై పెట్టుబడులు..
క్లౌడ్‌ను వినియోగించుకోవడంలో భారత్‌లో విపరీతమైన వేగం కనిపిస్తోంది. క్లౌడ్‌ ఆధారిత సర్వర్లను మేం ఇక్కడ విక్రయించాం. భవిష్యత్‌లో ఆర్థిక వృద్ధికి ఇంధన సామర్థ్యం కీలకం కానుంది. మనకు ఆర్థిక వృద్ధి కావాలంటే.. ప్రస్తుత స్థాయిలో ఇంధనాన్ని వాడకూడదు. కృత్రిమ మేధ నుంచి భారీ ప్రయోజనాలు అందుకోవాలంటే.. డేటా మౌలిక వసతులు అవసరం. అందుకే ఇందులో పెట్టుబడులు పెడుతున్నాం.

ఈ దశాబ్దం చివరకు మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మారే అవకాశం ఉంది. డెవలపర్లు రాణిస్తుండడం, పెరుగుతున్న ఏఐ ప్రాజెక్టులు, నైపుణ్యం పెంచుకోవడం వంటి విషయాలు ఇందుకు సానుకూలతలను తెచ్చిపెట్టొచ్చు. నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండే మానవ వనరులు మనకు అత్యంత అవసరం. భద్రత, సహకార వ్యాపార ప్రక్రియ, సిబ్బందిలో తిరిగి ఉత్సాహాన్ని నెలకొల్పడం, క్లౌడ్‌కు మారడం, డేటా ఏకీకరణ, ప్లాట్‌ఫామ్‌లకు ఏఐ నమూనాలను అమలు చేయడం వంటి ఆరు కీలక అంశాలపై మైక్రోసాఫ్ట్‌ దృష్టి సారిస్తుంది.

హైదరాబాద్‌కూ వస్తారు..
నాలుగు రోజుల తన పర్యటనలో భాగంగా సత్య నాదెళ్ల దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలోనూ పర్యటించునున్నారు. కీలక వినియోగదార్లు, అంకురాల నిర్వాహకులు, డెవలపర్లు, ఎడ్యుకేటర్లు, విద్యార్థులను కలవనున్నారు. 2020 ఫిబ్రవరి తర్వాత ఆయన మనదేశానికి రావడం ఇదే తొలిసారి.

భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ సాంకేతికతను చిన్న, పెద్దా కంపెనీలు ఎలా వినియోగిస్తున్నాయో చెప్పేందుకు నాదెళ్ల కొన్ని ఉదాహరణలు పేర్కొన్నారు. అవేంటంటే..

  • వివిధ వినూత్న సేవలతో పాటు దివ్యాంగులు ఏటీఎమ్‌ కార్డు వినియోగించుకునేందుకు ఎస్‌బీఐ మా "పవర్‌ యాప్స్‌"ను ఉపయోగించుకుంటోంది.
  • "అజూర్‌ ఏఐ" ద్వారా కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ పలు భారతీయ భాషలకు అనువాద సేవలు కల్పిస్తోంది.
  • రియల్‌టైంలో అన్ని ప్రాజెక్టుల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఎల్‌ అండ్‌ టీ కూడా "అజూర్‌ ఐఓటీ, ఏఐ"ని వాడుతోంది.
  • "మైక్రోసాఫ్ట్‌ డైనమిక్స్‌ 365"ను వినియోగిస్తూ సెంకో గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ తన వినియోగదార్ల నుంచి సేకరించిన డేటాతో రిసోర్స్‌ ప్లానింగ్‌, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ చేయగలుగుతోంది.
  • "మైక్రోసాఫ్ట్‌ 365 టూల్స్‌" ద్వారా ఎయిరిండియా తన ఉద్యోగులకు సెక్యూరిటీ సొల్యూషన్లను అందిస్తోంది.
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌లతో భాగస్వామ్యం

మైక్రోసాఫ్ట్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌తో అప్లికేషన్‌ పోర్ట్‌పోలియో అభివృద్ధి చేయడంతో పాటు, డేటా వ్యవస్థను ఆధునికీకరించడం, ఎంటర్‌ప్రైజ్‌ అంశాలకు భద్రత అందించడం ఇందులో భాగంగా ఉంటాయి. "మా వినియోగదార్లకు సరికొత్త బ్యాంకింగ్‌ అనుభవాన్ని అందించడమే మా లక్ష్యం. ఇటువంటి భాగస్వామ్యాలు కుదుర్చుకోవడంతో పాటు ప్రొప్రైటరీ ఇంటలెక్చువల్‌ ప్రోపర్టీ(ఐపీ)లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీనిని సాధిస్తామ"ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గ్రూప్‌ హెడ్‌(ఐటీ), సీఐఓ రమేశ్‌ లక్ష్మీ నారాయణన్‌ పేర్కొన్నారు.

యెస్‌ బ్యాంక్‌ సైతం: మైక్రోసాఫ్ట్‌తో భాగసామ్యం కుదుర్చుకున్నట్లు యెస్‌ బ్యాంక్‌ కూడా ప్రకటించింది. తన వినియోగదార్లకు వ్యక్తిగత బ్యాంకింగ్‌ అనుభవాన్ని అందించేలా తదుపరి తరం మొబైల్‌ అప్లికేషన్‌ను తీసుకువచ్చేందుకు ఈ భాగస్వామ్యం ఉపకరిస్తుందని పేర్కొంది.

  • పబ్లిక్‌ క్లౌడ్‌ సేవల (పీసీఎస్‌) ద్వారా సంస్థలు, వ్యక్తులకు కంప్యూటింగ్‌, స్టోరేజీ అప్లికేషన్లను ఒక పబ్లిక్‌ ఇంటర్నెట్‌పై అందించవచ్చు. అదే ప్రైవేటు క్లౌడ్‌ నమూనా వనరులు, సంబంధిత సంస్థకే అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం భారత్‌లో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌(ఏడబ్ల్యూఎస్‌), గూగుల్‌ క్లౌడ్‌, మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ వంటివి ప్రముఖ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ప్రొవైడర్లుగా ఉన్నాయి.
  • 2026 కల్లా భారత పబ్లిక్‌ క్లౌడ్‌ సేవల విపణి 13 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చని ఐడీసీ అంచనా వేస్తోంది. 2021-26లో 23.1 శాతం సమ్మిళిత వృద్ధిని నమోదు చేయొచ్చంటోంది. 2022 ప్రథమార్ధంలో 2.8 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేసింది.

చాట్‌జీపీటీ, డాల్‌-ఇ వంటి ఏఐ టూల్స్‌కు 2021 నాటికి ప్రపంచంలోని ఏఐ డేటా సెట్స్‌లో 1 శాతం కంటే తక్కువ వాటానే కలిగి ఉంది. 2025 కల్లా ఇది 10 శాతానికి చేరొచ్చని మైక్రోసాఫ్ట్‌ భావిస్తోంది.

Last Updated : Jan 4, 2023, 8:44 AM IST

ABOUT THE AUTHOR

...view details