తెలంగాణ

telangana

ETV Bharat / business

'వర్క్‌ ఫ్రమ్‌ హోం'తో ఉత్పాదకత పెరిగింది.. కానీ..: సత్య నాదెళ్ల - undefined

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల ఉత్పాదకత పెరిగినప్పటికీ, ఉద్యోగుల మధ్య సంబంధాలు మెరుగుపడాలన్నా, కొత్త బృందాలను ఏర్పాటు చేయాలన్నా కార్యాలయానికి వెళ్తేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల  అభిప్రాయపడ్డారు.

microsoft-ceo-satya-nadella-offers-way-to-bring-employees-back-to-office
microsoft-ceo-satya-nadella-offers-way-to-bring-employees-back-to-office

By

Published : Oct 21, 2022, 8:44 AM IST

కొవిడ్‌ పరిస్థితులు తగ్గుముఖం పట్టడం, జనజీవనం సాధారణ స్థితికి వచ్చినందున పరిశ్రమలు ఉత్పాదకత పెంచడానికి సరికొత్త మార్గాలవైపు అడుగులేయాల్సిన అవసరముందని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల అన్నారు. ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పని సంస్కృతిని మార్చడం ఎలా?అనేదాని గురించి ఆయన మాట్లాడారు. వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు రావాలని చాలా సంస్థలు కోరుతున్నాయని చెప్పిన ఆయన.. సంస్థకు, ఉద్యోగికి అనుకూలంగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటే మంచిదని చెప్పారు.అయితే, ఉద్యోగుల మధ్య సంబంధాలు మెరుగుపడాలన్నా, కొత్త టీంలు ఏర్పాటు చేయాలన్నా కార్యాలయానికి రావడమే ఉత్తమమని చెప్పారు. ఉద్యోగులకు మేనేజర్లు ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్తే ప్రయోజనముంటుందన్నారు. మైక్రోసాఫ్ట్‌ సహా గూగుల్‌, అమెజాన్‌ లాంటి కంపెనీలు వారంలో కొన్ని రోజుల పాటు ఆఫీసుకు వచ్చి, మిగతా రోజులు ఇంటి నుంచే పని చేసుకునేందుకు ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తున్నాయని నాదెళ్ల చెప్పారు. దీనివల్ల సంస్థకు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని, అంతేకాకుండా ఉద్యోగులు కూడా సౌకర్యవంతంగా పని చేసుకునేందుకు వీలుంటుందని అన్నారు.

భారత్‌లో దాదాపు 80 శాతం మంది ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేందుకు సరైన కారణాలు అడుగుతున్నారని నాదెళ్ల చెప్పారు. కేవలం మేనేజర్లతో సమావేశానికి తప్ప ఇంకే ఉపయోగం ఉండదని వారు అభిప్రాయపడుతున్నారన్నారు. అందువల్ల మేనేజర్లు కంపెనీ పాలసీ గురించి చెప్పి ఆఫీసుకు రావాలని బలవంతం చేయడం కంటే.. తోటి ఉద్యోగుల మధ్య సంబంధాలు బలపడాలంటే కార్యాలయాలకు రావాలనే విషయాన్ని వారికి వివరంగా చెప్పగలగాలన్నారు. వర్క్‌ ఫ్రం హోం వల్ల ఉద్యోగులు సరిగా పని చేయడం లేదని, దాని ప్రభావం ఉత్పాదకతపై పడుతోందని మేనేజర్లు అంటున్నప్పటికీ రికార్డులు దానికి భిన్నంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆఫీసుకు వచ్చినప్పటి కంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఉద్యోగులు ఎక్కువ పని చేస్తున్నట్లు తేలిందన్నారు. అయితే, తోటి ఉద్యోగులకు సాయం అందించడంలోనూ, పని ప్రాధాన్యతను నిర్ధారించడంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నట్లు చెప్పారు.

For All Latest Updates

TAGGED:

microsoft

ABOUT THE AUTHOR

...view details