తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫేస్​బుక్ ఉద్యోగులకు మరో షాక్.. 10 వేల మంది లేఆఫ్​

ఫేస్​బుక్ మాతృసంస్థ మెటా.. మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. తమ సంస్థ నుంచి 10,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. మరో 5 వేలు ఖాళీలు ఉన్నా ప్రస్తుతం నియామకాలు చేపట్టమని పేర్కొంది.

meta layoffs 2023
meta layoffs 2023

By

Published : Mar 14, 2023, 7:11 PM IST

Updated : Mar 14, 2023, 9:37 PM IST

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్‌ మరోసారి భారీగా ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. గత నవంబరులో 11 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన మెటా.. రెండో విడతలో మరో 10 వేల మందిని తొలగించనుంది. ఉద్యోగాల తొలగింపు విషయమై ఫేస్‌బుస్ సంస్థ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఓ సందేశాన్ని సిబ్బందికి పంపారు. అంతే కాకుండా ఓపెన్ రోల్ విభాగంలో నియమిస్తామని చెప్పిన 5 వేల మందిని కూడా తీసుకోమని స్పష్టం జుకర్​బర్గ్ స్పష్టం చేశారు.

"నేను 2023లో సంస్థ నుంచి ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని ముందే చెప్పాను. వ్యాపార పనితీరు మెరుగుపరచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగుల తొలగింపు నిర్ణయం చాలా కఠినంగా అనిపించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల తొలగింపు తప్పట్లేదు"

--మార్క్ జుకర్​బర్గ్, ఫేస్​బుక్ సీఈఓ

మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది 13 శాతం. మెటా ప్లాట్‌ఫామ్స్‌ చరిత్రలో అదే భారీ ఉద్యోగాల కోత కావడం గమనార్హం. ప్రకటనల ఆదాయం తగ్గడమే ఇందుకు కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా వ్యయాలు తగ్గించుకునేందుకు మెటా భారీగా ఉద్యోగులను తొలగిస్తోంది.

అట్లేషియన్‌లో 500 మంది తొలగింపు: ఆస్ట్రేలియాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అట్లేషియన్‌ 500 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థ మొత్తం ఉద్యోగుల్లో ఈ సంఖ్య 5 శాతానికి సమానం. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. 2022 చివరి నాటికి సంస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 10,787గా ఉంది. గత నాలుగేళ్లలో ఉద్యోగుల సంఖ్య మూడింతలైంది.

గూగుల్​లోనూ ఉద్యోగాల కోత..
గూగుల్​ సైతం 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఇటీవల వెల్లడించింది. స్టార్ పెర్ఫార్మర్లను సైతం తొలగించేందుకు వెనకాడటం లేదు. హైదరాబాద్​ గూగుల్ కార్యాలయంలో పనిచేసే ఓ స్టార్ పెర్ఫార్మర్​ను విధుల్లో నుంచి తొలగిస్తూ ఇటీవల మెయిల్ పంపింది ఆ సంస్థ. దీంతో ఒక్కసారి ఆయన నిరాశకు గురయ్యారు.

యాహు కూడా..
యాహూ సైతం తమ సిబ్బందిని తగ్గించుకోనున్నట్లు ప్రకటించింది. దాదాపు 20 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు గతనెలలో ప్రకటించింది. ముఖ్యంగా యాడ్‌- టెక్‌ విభాగంలోని ఉద్యోగుల్లో సగం మంది ఇంటిబాట పట్టనున్నారు.

ఇటీవల దిగ్గజ సాంకేతిక సంస్థలు వరుసగా తమ ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. 2022లో మొదలైన ఈ లేఆఫ్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వంటి బడా కంపెనీలు భారీగా ఉద్యోగులపై వేటు వేశాయి. 2022 నుంచి ఇప్పటివరకు మొత్తం తొలగించిన ఉద్యోగుల సంఖ్య 3లక్షలు దాటిందని లేఆఫ్స్.ఎఫ్​వైఐ అనే వెబ్​సైట్ అంచనా వేసింది.

Last Updated : Mar 14, 2023, 9:37 PM IST

ABOUT THE AUTHOR

...view details