ఉద్యోగుల్లో మానసిక అనారోగ్యం కారణంగా.. గైర్హాజరు, తక్కువ ఉత్పాదకత, వలసలు వంటి వాటిని కంపెనీలు ఎదుర్కోవడం వల్ల ఏటా 14 బిలియన్ డాలర్ల మేర ఖర్చు చేయాల్సి వస్తోందని డెలాయిట్ ఒక సర్వేలో పేర్కొంది. కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా మానసిక ఆరోగ్య సమస్యలు స్థిరంగా పెరుగుతున్నాయి. కరోనా అనంతరం అవి మరింత పెరిగాయి. ప్రపంచ మానసిక ఆరోగ్య ఒత్తిడిలో భారత్ వాటా 15 శాతంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది. కాగా, భారత ఉద్యోగుల్లో మానసిక ఆరోగ్యాన్ని విశ్లేషించడం కోసం 'మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఇన్ ద వర్క్ ప్లేస్' పేరిట సర్వే చేపట్టినట్లు డెలాయిట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ సర్వే ప్రకారం..
- తమ మానసికారోగ్యంపై పని ప్రదేశం-సంబంధిత ఒత్తిడే ఎక్కువ ప్రభావం చూపిస్తోందని 47 శాతం వృత్తినిపుణులు పేర్కొన్నారు. ఈ ఒత్తిడి వల్ల వ్యక్తిగత, వృత్తిగత జీవితంపైనా ప్రభావం పడుతోందన్నారు.
- మానసిక అనారోగ్యం వల్ల గైర్హాజరు కనిపిస్తోంది. ఒక వేళ హాజరైనా తక్కువ ఉత్పాదకతే ఉంటోంది.
- గత ఏడాది కాలంగా 80 శాతం భారత సిబ్బందిలో మానసికారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. అయితే లక్షణాలు కనిపిస్తున్నా.. ఇతరులు ఏమనుకుంటారో అని 39 శాతం మంది చికిత్సకు దూరంగా ఉంటున్నారు.
- మానసికారోగ్యం ఉన్నా 33 శాతం మంది ఆఫీసులకెళుతున్నారు. 29% మంది సెలవులు పెడుతుండగా.. 20 శాతం మంది రాజీనామా చేసి తమ ఆరోగ్యాన్ని చూసుకుంటున్నారు.
- చాలా వరకు కంపెనీలు ఉద్యోగుల ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యతలను గుర్తిస్తున్నాయి. ఇందు కోసం థర్డ్ పార్టీ సహాయాన్ని కూడా తీసుకుంటున్నాయి.